పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సెంటినరీ కాలనీ ఓపెన్ కాస్ట్ గని-1లో జరిగిన పేలుడు ఘటనా స్థలాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ సందర్శించారు. ఓవర్ బర్డెన్ (ఓబీ) మట్టిని తొలగించేందుకు డిటోనేటర్లు అమర్చి సర్రీ నింపుతున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సీపీ అన్నారు. ప్రమాదంలో నలుగురు ఒప్పంద కార్మికులు చనిపోగా.. మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
మిస్ ఫైర్ వల్లే పేలుడు..
బొగ్గు ఉత్పత్తి కంటే ముందు మట్టి (ఓవర్ బర్డన్) తొలగించే పనులను సింగరేణి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తుంది. ఈ క్రమంలో గుత్తేదారు మట్టి తొలగించేందుకు పేలుడు నిర్వహిస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నాలుగు మృతదేహాలను సింగరేణి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీపీ సత్యనారాయణ, సింగరేణి అధికారులు దుర్ఘటన పూర్వ పరాలను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. మట్టి తొలగించేందుకు 80 డిటోనేటర్లు అమర్చుతుండగా 36వ డిటోనేటర్ వద్ద ప్రమాదం జరిగిందని సీపీ సత్యనారాయణ వివరించారు.
ఇవీ చూడండి : సీఎం కాన్వాయ్కి అడ్డొచ్చిన యువకుడు.. కేసు నమోదు