పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం 22 ఏళ్ల అనంతరం ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రారంభమైంది. అధికారులు సుమారు రెండున్నర గంటల సమయంలో ప్రయోగాత్మకంగా యూరియా ఉత్పత్తి చేపట్టారు. కర్మాగారంలో సైలో, బ్యాగింగ్ ప్లాంట్లలో పనితీరును పరిశీలించారు. మూడు రోజుల క్రితం ప్రయోగాత్మకంగా అమ్మోనియా ఉత్పత్తిని చేపట్టిన అధికారులు... నిన్న యూరియా ఉత్పత్తి ప్రారంభించారు. ఖాయిలా పరిశ్రమగా 1999 మార్చి 31న అర్ధరాత్రి మూతపడ్డ కర్మాగారాన్ని... తిరిగి ఉత్పత్తి స్థాయికి తీసుకొచ్చిన అధికారులు, ఉద్యోగులను... సంస్థ సీఈవో నిర్లిప్‌సింగ్ రాయ్ అభినందించారు. మార్చి నెలాఖరులోగా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేపడతామని తెలిపారు.
అందరి సహకారంతో..
కర్మాగారంలో ఇకపై రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుంది. గతంలో సుమారు రూ.5,254 కోట్ల అంచనాలతో నిర్మాణం పనులు చేపట్టగా... కరోనా సహా వివిధ కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల వ్యయం రూ.6,120కోట్ల 55 లక్షలకు చేరుకుంది. ఎఫ్‌సీఐతో పాటు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం గెయీల్, డెన్మార్క్‌కు చెందిన హాల్డర్‌టాప్ సంస్థల భాగస్వామ్యంతో ఈ కర్మాగార నిర్మాణ పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం వాటాతో పాటు నీరు, విద్యుత్, సరఫరా, రవాణా కోసం రహదారి నిర్మాణం పనులు చేపడుతూ సహకారం అందించింది.
కిసాన్ బ్రాండ్ పేరుతో..
గతంలో రామగుండంలోని ఎస్బీఐ ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాను స్వస్తిక్ బ్రాండ్‌తో విక్రయించగా... ప్రస్తుతం ఉత్పత్తి కానున్న యూరియాను కిసాన్ బ్రాండ్‌తో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేయనుంది. కర్మాగారంలో ఉత్పత్తి తిరిగి ప్రారంభం కావడంతో.... స్థానికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలో తిరిగి ఉద్యోగాలివ్వాలని మాజీలు సంస్థ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభం కావడంతో... రాష్ట్రంలో యూరియా కొరత తీరనుందని రైతులు సంతోషపడుతున్నారు.
ఇదీ చూడండి: చక్కెర పరిశ్రమ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోవాలి.. లేదంటే?