పెద్దపల్లి జిల్లా మంథనిలో డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. గత మూడు రోజులుగా పలువురిపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ధైర్యం నింపేందుకు కవాతు చేశారు. అధికార పార్టీకి ఓటెయ్యలేదన్న కారణంగానే దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. మంథనిలో కౌంటింగ్ పూర్తయిన రోజు మంథనికి చెందిన ఐలి ప్రసాద్‌పై పలువురు అధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల అదే వ్యక్తులు మరుసటి రోజు ఎరుకల గూడెంకు చెందిన గంగాధరి సత్యనారాయణపై దాడి చేశారు. బాధితుడు.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇంటికి చేరుకొని దాడి జరిగిన విషయాన్ని తెలిపాడు. ఎమ్మెల్యే స్వయంగా తన వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. మంథని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరెపల్లి రాజేశ్‌పై దాడి
ఈ విషయం మరువక ముందే.. నిన్న ప్రమాణ స్వీకారం కాగానే విజయోత్సవ ర్యాలీ సంబురాలు పూర్తిచేసుకున్న అధికార పార్టీ కార్యకర్తలు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఆరెపల్లి రాజేశ్‌పై దాడి చేశారని బాధితుడి బంధువులు ఆరోపించారు. అధికార పార్టీ రెబల్ అభ్యర్థికి ప్రచారం చేయడం వల్లే దాడి జరిగినట్లు చెప్పారు. రాజేశ్‌ను మంథని ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా పరిస్థితి విషమంగా మారడం వల్ల కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదని డీసీపీ రవీందర్ తెలిపారు.
ఇవీ చూడండి: రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం.. నిధులివ్వండి: హరీశ్