వీరంతా బాలలే.. ఏదో ఒక రకంగా ఈ సమాజానికి దూరంగా, బతుకు భారంగా బంగారు బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్న పసివాళ్లకు ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తోంది. ప్రత్యేకంగా సమగ్ర బాలల పరిరక్షణ పథకాన్ని అమలు చేస్తుంది. మహిళల సాధికారతకు, వారి సర్వతోముఖాభివృద్ధికి ‘సఖి’ కేంద్రాలను నెలకొల్పిన విధంగానే బాలల సాధికారతకు ‘బాలరక్షభవన్’ను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
జిల్లాలో 227 పరిరక్షణ కమిటీలు
ఇప్పటికే సమగ్ర బాలల పరిరక్షణ పథకంలో భాగంగా గోదావరిఖనిలో రెండు, రామగుండంలో ఒకటి కలిపి మొత్తం మూడు బాలల సంరక్షణ సంస్థలు నెలకొల్పారు. ఇందులో 47 మంది బాలురు, 27 మంది బాలికలు.. మొత్తం 74 మంది చదువు, వసతి, ఆశ్రయం పొందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 227 గ్రామ బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ అమలవుతున్న 12 గ్రామాలను గుర్తించి బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
సర్వతోముఖాభివృద్ధికి బాలరక్ష భవన్
జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కింద ఆరేళ్ల లోపు పిల్లలు 33,059 మందికి పోషకాహారం సమృద్ధిగా అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం, గుడ్డు, ఆహారం అందిస్తున్నారు. తల్లిదండ్రుల చెంతన ఉండే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అనాథలు, విధి వంచితులైన పిల్లలకు అండగా ఉండేందుకు బాలరక్ష భవన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
వీరితో పాటు బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులు, దివ్యాంగులు, చెత్తకుప్పల్లో దొరికినవారు, బాలకార్మికులు, బాల యాచకులు, తప్పిపోయినవారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌తో పాటు ఆహారం, వసతి ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ భవన్‌లో కేవలం పిల్లల సంరక్షణే కాకుండా బాల నేరస్థులకు శిక్షలు విధించే ‘జువైనల్ కోర్టు’ గది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గది, జిల్లా పరిశీలన అధికారి(డీపీవో), స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్, చైల్డ్ లేబర్ ప్రొటెక్ట్, శిశు గృహం, 1098 హెల్ప్ లైన్ కార్యాలయం, వసతిగృహం వంటివి ఏర్పాటు చేయనున్నారు. పెద్దపల్లిలోని రామకృష్ణ థియేటర్‌కు ఎదురుగా పాత విద్యుత్తు కార్యాలయంలో ప్రతి నెలా రూ.35 వేలతో 7 గుంటల స్థలంలో అద్దె భవనంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
పునరావాస సేవలన్నీ ఒకే చోట
బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా, వారి సాధికారతకు దోహదపడేలా బాలరక్ష భవన్‌ను తాత్కాలికంగా అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అభ్యాగులైన పిల్లల అత్యవసర అవసరాలకు స్పందించి వారి దీర్ఘకాలిక పునరావాస సేవలన్నీ ఒకే చోట అందించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. త్వరలోనే ప్రారంభిస్తాం.
-అక్కేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి