పెద్దపల్లి జిల్లా మంథనిలో వరద బీభత్సానికి జనజీవనం అతలాకుతలం అయ్యింది. ప్రజలు కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి నెలకొంది. వరద కారణంగా దుబ్బగూడెం, దొంతులవాడ, మంగలివాడ, మర్రివాడ, బర్రెకుంట, శ్రీపాదచౌక్, పాత పెట్రోల్ పంప్ ఏరియా, పాత బస్టాండ్లో 1,214 ఇళ్లు నీట మునిగాయి. విద్యుత్ పరంగా 220 కేవీ టవర్లు మూడు, 132 కేవీ టవర్లు రెండు, 60 వరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు నేలకూలాయి. ప్రస్తుతం వరద వీడి నాలుగు రోజులు గడుస్తున్నా.. ప్రజల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తీవ్రంగా నష్టపోయారు. తడిసిన పుస్తకాలు, సర్టిఫికెట్లు, సామగ్రి ఎండబెట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని తెలిపారు.
మంథనిలోని దుకాణాలు, వాణిజ్య సముదాయాల్లో.. సరకులు పూర్తిగా నీటి పాలయ్యాయి. 93 దుకాణాలకు రేషన్ సరఫరా చేసే గోదాంలోకి నీళ్లు రావడంతో భారీ నష్టం వాటిల్లింది. సామగ్రి మునిగిపోవడంతో తిండి కోసం విలవిలలాడే పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు ఎవరు రాకపోయినా.. పాక్షికంగా కూలిన ఇళ్లకు, పూర్తిగా కూలిపోయిన వాటికి పరిహారం ఇస్తారనే ప్రచారం జరగుతుండటంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..: నీట మునిగిన తమ పరిస్థితి ఏంటని కొందరు బాధితులు కన్నీరు పెడుతున్నారు. వరదల్లో మునిగిపోయి పనికి రాకుండా పోయిన సామాన్లు తరలించేందుకు ఖర్చు అయ్యిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి..
రూపురేఖలు లేకుండాపోయిన రహదారులు.. ఇబ్బందులు పడుతున్న జనాలు
నడిరోడ్డుపై 'లిప్ లాక్ ఛాలెంజ్'.. ప్రముఖ కాలేజీ విద్యార్థుల రచ్చ!