తెలంగాణలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి జిల్లాలో మానేరు తీర ప్రాంతాలపై పటిష్ఠ నిఘా ఉంచారు. మానేరు తీరప్రాంతంలో ఉన్న గ్రామాల్లో సుల్తానాబాద్ ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఓదెల మండలంలోని కాల్వశ్రీరాంపూర్లో మావోయిస్టు సానుభూతిపరులను కలిసిన డీసీపీ రవీందర్.. మావోలకు సహకరించవద్దని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.
అనంతరం కిష్టంపేట గ్రామానికి చెందిన మావోయిస్టు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ ఇంటికి వెళ్లి.. అతను లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరేలా చూడాలని వెంకటేశ్ తల్లి వీరమ్మకు చెప్పారు. హింస ద్వారా సాధించేదేం లేదని, ప్రజాక్షేమం కోసం పోలీసులున్నారని, ఎలాంటి సమస్యలున్నా చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. కంకణాల రాజిరెడ్డి లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో చేరాలని చెప్పారు.
- ఇదీ చూడండి : పట్టుకోసం మావోయిస్టులు.. తిప్పికొడుతున్న పోలీసులు