పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ సేవలను ప్రారంభించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ సేవల నిమిత్తం నిర్మించిన అదనపు గదులను స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ధరణి పోర్టల్ ద్వారా పెద్దపల్లి జిల్లా ప్రజలకు పారదర్శకంగా భూ సంబంధిత సేవలు అందిస్తామని చెప్పారు.
ప్రజలకు సేవలు అందించేందుకు ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం రూపొందించిందన్నారు. ప్రజలకు సౌలభ్యంగా, సులభతరంగా ఉండే విధంగా ధరణి పోర్టల్ ఉందని తెలిపారు. భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారం ధరణి పోర్టల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుందని చెప్పారు.
దీని కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతాయని.. పట్టాదార్ పాస్ పుస్తకదారుల అంగీకారంతో మాత్రమే లావాదేవీలు జరుగుతాయని పేర్కొన్నారు. భూ బదలాయింపు చేసేందుకు పట్టాదారుడి బయోమెట్రిక్ ఆథంటికేషన్ అవసరమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ధరణి పోర్టల్ నూతనంగా ప్రారంభించినందున రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్