వర్షాధారంగా సాగుచేసే పప్పు దినుసుల పంటలను విరివిగా సాగుచేయాలని పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. మొక్కజొన్న మినహా వరి, పత్తి, కంది, పెసర, మినుములను పండించేలా రైతులను ప్రోత్సహించాలని సమగ్ర కార్యాచరణ సిద్ధంచేశారు.
రైతులు ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలని ప్రభుత్వం పేర్కొంటుంది. ఆయా ప్రాంతాలను బట్టి అధికారులు సిఫార్సు చేసిన పంటలు పండించకపోతే రైతుబంధు పథకం కూడా వర్తించదని సీఎం పలుమార్లు స్పష్టంచేశారు. వానాకాలం సాగులో దొడ్డురకాల ధాన్యం వైపు కాకుండా సన్నధాన్యం సాగుపై మొగ్గుచూపాలని కోరుతున్నారు. పప్పు దినుసులు విరివిగా సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు.
వ్యవసాయ అధికారులు జిల్లాలోని 14 మండలాల్లోని 1,64,850 హెక్టార్ల భూమి సాగుకు యోగ్యంగా నిర్ధారించగా ఈ సీజన్‌లో దాదాపుగా 1,14,939 హెక్టార్లలో సాగు అవుతుందని అధికారులు సమగ్ర నివేదిక రూపొందించారు. పత్తి సాగు పెరిగితే విక్రయాల సమయంలో ఏర్పడే ఇబ్బందులను నివేదికలో పొందుపరిచారు.
జిల్లాలో వరిసాగు విస్తీర్ణంలో 45 శాతం సన్నరకాలు ఉండాలని నివేదికలో పేర్కొన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుని ఈ వానాకాలం నాటికి 1,92,541 ఎకరాల్లో వరి, 1337-కంది, 81,172 ఎకరాల్లో పత్తి, 565-పెసర, 165 ఎకరాల్లో ఇతర పంటలు సాగుకానున్నాయి. గత వానాకాలంలో 77,961 హెక్టార్లలో వరిసాగు చేయగా 4,87,256 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గత ఖరీప్‌లో పత్తి పంటకు సంబంధించి 31,122 హెక్టార్లలో సాగుచేయగా 77,805 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సీజన్‌లో 81,172 ఎకరాల్లో పత్తి సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
క్లసర్ట వారీగా ప్రణాళికలు
పంటల సాగు కోసం క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్వహించేందుకు సిద్ధంచేశారు. ఆదివారం నుంచి జిల్లాలో రెండు పూటలా ఉదయం, సాయంత్రం వేళల్లో సదస్సులు నిర్వహించి రైతులను పంటల సాగుపై చైతన్యం చేయనున్నారు. జిల్లాలో 55 క్లస్టర్ల పరిధిలో ప్రజాప్రతినిధులు, రైతులను భాగస్వాములను చేస్తూ రైతుబంధు, నియంత్రిత పంటల సాగులోని అపోహలు తొలగించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. లాభాసాటి పంటల విధానంలోని అంశాలను వివరించేందుకు వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది.
నేటి నుంచి రైతు వేదికలు
రైతులు పండించిన పంట ఉత్పత్తులు లాభాసాటిగా ఉండేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారిణి సిక్తాపట్నాయక్ తెలిపారు. ఈ విధానంలోని అనుమానాలను రైతు వేదికల్లో నివృతి చేయాలన్నారు. ఆదివారం నుంచి రైతు వేదికలు నిర్వహించేందుకు సిద్ధంకావాలన్నారు.
జిల్లాలో 55 క్లస్టర్ల పరిధిలో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు, రైతులను భాగస్వాములను చేయాలన్నారు. క్లసర్ట వారీగా పండించే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మొక్కజొన్న పంటకు బదులుగా కంది, పత్తి సాగును ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో సన్నరకాల ధాన్యం ఎక్కువగా పండించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.