Job opportunities for women in Singareni : ఇంతకు ముందు బొగ్గుగనుల్లో పురుషులకే అవకాశం ఉండేది. చట్టాల్లో మార్పు కారణంగా మైనింగ్ రంగంలోనూ మహిళలకు అవకాశం ఏర్పడింది. దాంతో పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూలో మైనింగ్ ఇంజినీరింగ్‌లో చేరే యువతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసక్తితో ఈ కోర్సులో చేరామన్న యువతులు శిక్షణ కూడా అంతే థ్రిల్లింగ్‌గా ఉంటోందంటున్నారు. వీరంతా మంథని జేఎన్టీయూలో మైనింగ్లో ఇంజినీరింగ్ చదువుతున్న యువతులు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి వచ్చారు.
ఛాలెజింగ్ కెరీర్ ఎంచుకోవడమే తమకిష్టమని చెబుతున్నారు. అందుకే మైనింగ్‌లో చేరామని, సమాజంలో ఈ రంగంపై మరింత అవగాహన రావాలంటున్నారు. సింగరేణిలో 43వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 1600వరకే మహిళలు ఉన్నారు. ఇందులో చాలావరకు ఆసుపత్రుల్లో సహాయకులుగా మాత్రమే ఉన్నారు. గనుల్లో ప్రమాదకరమైన విధుల్లో మహిళలకు అనుమతి లేదు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడమే కాక బొగ్గుగనుల్లో యాంత్రీకరణ పెరిగిందంటున్నారు.
"మైనింగ్ అంటే ఆసక్తితో ఈ కోర్సు ఎంచుకున్నాను. ఈ రంగం అంటే చాలా ఇష్టం. మా సొంత జిల్లా కరీంనగర్ కావడంతో సింగరేణిలో కష్టాలపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు సింగరేణిలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దానిని ఉపయోగించి మరిన్ని విజయాలు సాధిస్తానని నమ్మకం ఉంది". పుష్ప, జేఎన్టీయూ విద్యార్థిని
Engineering Diploma in Mining Course : గతంతో పోలిస్తే ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయని మైనింగ్ ఇంజనీరింగ్ చేస్తున్న యువతులు చెబుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న ఉద్యోగం పూర్తి సాంకేతికతతో, యాంత్రీకరణతో భద్రంగా మారింది అంటున్నారు. సాఫ్ట్వేర్ రంగం కంటే తమకు ఈ రంగంలోనే మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అయితే తల్లిదండ్రులు తమ బిడ్డలను నచ్చిన రంగంలో ప్రోత్సహించాలంటున్నా రు. ఈ రంగంలోకి మరింతమంది రావాలంటే అవగాహన, ప్రచారం అవసరమంటున్నారు.
ఛాలెంజింగ్ ఉద్యోగం చేయాలన్న పట్టుదలతో మరికొంత ఇందులో చదువుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మైనింగ్ రంగంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు పూర్తి సేఫ్టీతో పని చేస్తున్నాం కాబట్టి చాలెంజింగ్ జాబ్‌లో చేరాలనుకొనే వారు మైనింగ్ వైపు రావాలని, తన తల్లిదండ్రులు అలాగే పంపించారంటోంది ఈ విద్యార్థిని. గతంలో అవగాహన లేక ఎక్కువ మంది మైనింగ్‌లో చేరలేదు. జెఎన్‌టీయులో ఇప్పటి వరకు 6 బ్యాచ్‌లు వచ్చినా సంఖ్య పెరగలేదు. ఇటీవల క్రమంగా ఆ సంఖ్య పెరుగుతోంది.
"మా నాన్న సింగరేణి ఉద్యోగి. చిన్నప్పుడు మా నాన్నతో కలిసి సింగరేణి బొగ్గు గనుల్లోకి వెళ్లేదాన్ని. అలా ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. దానికి తోడు మేం నలుగురు ఆడపిల్లలం అందువల్ల మా నాన్న తరువాత.. నేను మా కుంటుంబాన్ని పోషించాలి. అందుకే నేను మైనింగ్ ఎంచుకున్నా. చాలా మందికి ఇక్కడ మైనింగ్లో కోర్సు ఉందని తెలియదు. వారికి అవగాహన కల్పించాలి". -రక్షిత, విద్యార్థిని
ఈ రంగంలో రానున్న కాలంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు అధ్యాపకులు. మహిళలు కూడా గనుల్లో పనిచేయాలని, సవాలు విసిరే ప్రతీ పని మహిళలు చేయగలరు అంటున్నారు ఈ యువతులు. ఛాలెంజింగ్ ఉద్యోగం కోసం మైనింగ్ ఇంజనీరింగ్‌లో చేరి, కొత్తగా చేరాలనుకునేవారిని ప్రోత్సహిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు ముందుకుసాగలంటున్నరీ యువతులు.
ఇవీ చదవండి: