కరోనా కట్టడిలో తెరాస సర్కారు వైఫల్యాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ "స్పీకప్ తెలంగాణ" పేరిట ఆన్లైన్ ఉద్యమం చేపట్టినట్లు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తెలిపారు. పీసీసీ టాస్క్‌ఫోర్స్ నేతృత్వంలో అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని పెద్దపల్లి జిల్లా మంథనిలో వెల్లడించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం.. రోజురోజుకు పెరుగుతున్న కేసులపై ఎందుకు స్పందించటంలేదని నిలదీశారు.
కరోన వైద్య పరీక్షలు, చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చాలని... పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆన్లైన్ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.