భూ ప్రక్షాళనపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపెల్లి జిల్లా మంథనిలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భూమి పట్టాపాస్ పుస్తకాలు, ఇతర భూ సమస్యలపై ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. భూ పట్టాపాస్ బుక్కులు అందక చాలా మంది రైతుబంధు కోల్పోయారని ఆరోపించారు.
రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లయినా... ఇప్పటివరకు అసైన్మెంట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలేదన్నారు. రెవెన్యూ వ్యవస్థను సీఎం కేసీఆర్ తప్పు పట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో భూసమస్యలు ఉన్న రైతులందరూ... పోస్ట్ కార్డుపై తమ సమస్యను రాసి సీఎం కేసీఆర్ కార్యాలయానికి పంపించాలని ఎమ్మెల్యే కోరారు.