పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిషత్ కార్యాలయం ఎదుట గత 4 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలిపారు.
గ్రామస్థాయిలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు వంద రోజుల పని కల్పిస్తూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్న జీవో నెంబర్ 4779ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని.. పెండింగ్లో ఉన్న వారి వేతనాలను వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు దినసరి వేతనం రూ. 350లు చెల్లిస్తూ.. పని చేసిన 15 రోజుల్లోనే డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్ రెడ్డి