తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చాలన్న లక్ష్యంతోనే రైతు వేదికల నిర్మాణం చేపట్టామని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, కుక్కలగూడుర్‌లో రైతు వేదిక భవనాలను కొప్పుల, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు కలసి ప్రారంభించారు.
దేశంలో రైతువేదికలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఆరేళ్లలో చేసి చూపించిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగం బాగుంటే.. ఈ సమాజం అంతా బాగుంటుందన్నారు. రైతులు తాము పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకోవాలంటే.. రైతులు సంఘటితం కావాలన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయం రంగం బలోపేతం కోసం రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరెంటు, ఎరువులు అందుబాటులో ఉంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి కొనియాడారు. ఈ రైతు వేదికల ద్వారా వ్యవసాయంలో మెళకువలు, పంటల విధానం, పంటల సాగుపై రైతువేదికల ద్వారా రైతులకు విజ్ఞానం అందిస్తామన్నారు. ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగంలో ఇన్ని పథకాలు లేవన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ వాల్వ అనసూర్యరాంరెడ్ది, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచ్ దుర్గం జగన్, గొండ్ర చందర్, దుర్గం కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సమస్య పరిష్కారం కోసం ప్రగతి భవన్‌కు పాదయాత్ర