సర్కారు బడుల్లో ఉచితవిద్యతో పాటు మధ్యాహ్న భోజనం పథకం కింద పట్టెడు మెతుకులు తినొచ్చని ఆశపడే పేద పిల్లలకు ఆకలి కష్టాలు చుట్టుముట్టాయి. అప్పులు చేసి అన్నం పెడుతున్న తమను విద్యాశాఖ తిప్పలు పెడుతోందంటూ మహిళా కార్మికులు సమ్మె బాట పట్టడంతో మధ్యాహ్న భోజనం ఆగిపోయి లక్షల మంది పేద విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లోని వందలాది పాఠశాలల్లో వంట ఆగిపోయింది. తామూ మానుకుంటున్నామని సిద్దిపేట జిల్లా కార్మికులూ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఈటీవీ భారత్ కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లోని పలు పాఠశాలలను పరిశీలించింది. బడిలో భోజనం ఆగిపోవడంతో పిల్లలు అవస్థలు పడుతున్నారు.
కార్మికులకు నష్టం.. పిల్లలకు కష్టం
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఉన్నత పాఠశాలలో గుడ్డుకు బదులు అరటిపండ్లు ఇస్తున్న వంట కార్మికులు
రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు అన్నం బాక్సులను ఇళ్ల నుంచే తెచ్చుకుంటున్నారు. బడికి దగ్గరగా ఉన్న పిల్లలు ఇళ్లకు వెళ్లి తిని వస్తున్నారు.ఏదీ వీలుకాని పరిస్థితుల్లో కొందరు ఆకలితో నకనకలాడుతున్నారు. సర్కారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెట్టడం తమ వల్ల కాదని వంట ఏజెన్సీ బాధ్యతల నుంచి మహిళలు తప్పుకొంటున్నారు. సర్కారు బడుల్లో దాదాపు 52 వేల మంది వంట కార్మికులు పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనం ఇస్తోంది. పదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఎన్నేళ్లు ఎదురుచూసినా ప్రయోజనం లేకపోవడంతో పదిరోజులుగా సమ్మెకు దిగారు. 1-5 తరగతుల విద్యార్థులకు రోజుకు రూ.4.97లు, 6-10 తరగతుల విద్యార్థులకు రూ.7.45లను ప్రభుత్వం ఇస్తోంది. కూరగాయలు, నూనె ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఆ ధరలకు భోజనం వండి పెట్టడం వల్ల నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. గత సెప్టెంబరు నుంచి బిల్లులు చెల్లించలేదని, ఒక్కో ఏజెన్సీకి రూ.లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వారు చెబుతున్నారు. వారానికి మూడు రోజుల చొప్పున కోడిగుడ్లు అందించాలి. ఒక్కో కోడి గుడ్డుకు ప్రభుత్వం రూ.4ల చొప్పున చెల్లిస్తోంది. మార్కెట్లో మాత్రం రూ.5 నుంచి రూ.6ల చొప్పున కొనాల్సి వస్తోంది. దాంతో వారంలో ఒక రోజు గుడ్డు బదులు అరటిపండ్లు ఇస్తున్నారు.
ఇళ్లకు వెళ్లి అన్నం తినివస్తున్న పూసాల ప్రాథమిక పాఠశాలల పిల్లలు. ముగ్గురు మనవరాళ్లను తోడ్కొని వస్తున్న మహాలక్ష్మి (వెనక)
ఇదీ పరిస్థితి..
* మధ్యాహ్న భోజన పథకం ఆగిపోవడంతో పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి, పూసాల ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు ఇళ్ల నుంచి అన్నం బాక్సులు తెచ్చుకొని తింటున్నారు. పెద్ద పిల్లలు ఇళ్లకు వెళ్లి తినివస్తున్నారు. ఇళ్లకు వెళ్లినప్పుడు ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేశారు.
* కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో 30 శాతం మంది పిల్లలు ఇళ్లకు వెళ్లి తిని వస్తున్నారు. మిగిలిన వారు ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ అత్యంత పేదలైన కొందరు విద్యార్థులు పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్టల్‌లో తింటుండటం గమనార్హం.
* సిద్దిపేట జిల్లాలో కూడా తమ డిమాండ్లు నెరవేర్చకుంటే వంటను నిలిపివేస్తామని మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం జిల్లా కమిటీ కలెక్టర్‌కు నోటీసు అందజేసింది. ఈ క్రమంలో బెజ్జంకి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకోవాలని విద్యార్థులందరికీ సమాచారం ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
* నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రత్యక్ష తరగతులు మొదలైన సెప్టెంబరు నుంచి ఒక్కసారి కూడా కోడిగుడ్డు పెట్టలేదు. ఈ పాఠశాలలో 1420 మంది పిల్లలున్నారు. వారికి గుడ్లు ఇవ్వాలంటే ఒక రోజు 8,520 రూపాయాలు అవసరం. అంటే వారానికి మూడు సార్లు చొప్పున రూ.25 వేలకుపైగా అవసరం. సర్కారు మాత్రం ఒక్కో గుడ్డుకు నాలుగు రూపాయలే ఇస్తోంది. దీనిబట్టి వారానికి రూ.4,260 నష్టం వస్తోంది. దాంతో ఇక్కడ గుడ్డును అందించడం లేదు.
* మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ఉన్నత పాఠశాలలో గుడ్డుకు బదులు అరటిపండ్లు అందించారు. వారానికి మూడు రోజులు గుడ్ల బదులు రెండు రోజులు ఇస్తున్నారు. ఒక రోజు అరటిపండు సరఫరా చేస్తున్నారు.
ఇంటి వద్ద గుడ్లు ఉండవు కదా?
-ప్రజ్వల్, 9వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్
మా నాన్న సుతారి పనికి, అమ్మ పత్తి ఏరడానికి వెళ్తుంది. బడికి వచ్చే సమయానికి బాక్సు పెట్టడం మా ఇంట్లో వీలుకాదు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని ఇంటికి వెళ్లి తినివస్తున్నా. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అయినా ఇంట్లో గుడ్లు ఉండవు. బడిలో మూడు సార్లు తినేవాడిని.
కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలి
- రమ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (ఏఐటీయూసీ) నేత
గత 19 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు పదేళ్లుగా రూ.వెయ్యి మాత్రమే చెల్లిస్తున్నారు. కనీస వేతనాన్ని నెలకు రూ.21 వేలు చెల్లించాలి. ప్రతి విద్యార్థికి రూ.15 చొప్పున బడ్జెట్ కేటాయించాలి. డిమాండ్లను నెరవేర్చాలని ఈనెల 20, 21న మండల కేంద్రాల్లో ధర్నాలు, జనవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో రెండు రోజులపాటు ధర్నా చేయాలని నిర్ణయించాం.
పేద విద్యార్థులే నష్టపోతున్నారు
- కటకం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌టీఎఫ్
మా పిల్లలు తినే బియ్యాన్ని ప్రభుత్వ బడుల్లో పేదలకు ఇస్తున్నామని సర్కారు చెప్పుకుంటోంది. ఇప్పుడు పలు జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయింది. వంట కార్మికులవి న్యాయమైన డిమాండ్లే. వాటిని వెంటనే తీర్చాలి. లేకుంటే నష్టపోయేది పేద విద్యార్థులే. అన్నం కోసం సర్కారు బడుల్లో చేరే విద్యార్థులూ వేల మంది ఉన్నారు.
ఇవీ గణాంకాలు..
* మొత్తం ప్రభుత్వ పాఠశాలలు: 26,500
* వాటిల్లో విద్యార్థుల సంఖ్య: 22.60 లక్షలు
* ప్రస్తుతం పథకం ఆగిపోయిన జిల్లాలు: కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల (కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు)