యోగా సాధనతో మనుషులకు అనేక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తాను గత పదిహేనేళ్లుగా యోగా చేస్తున్నానని ఆయన అన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు.
ప్రజలందరూ యోగా సాధనను తమ దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. తద్వారా ఎలాంటి వ్యాధులు రాకుండా జీవితం సంతోషమయం అవుతుందన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం విజయమ్మ పౌండేషన్ ద్వారా ఉచితంగా యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. యోగా సాధనతో కరోనా వ్యాధిని నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్, యోగా గురువులు సుధాజీ, సుజాతజీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండీ : జిలుగు సాగును సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్