కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములిచ్చిన రైతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముంపు గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. భూములు ఇచ్చి నేటికీ మూడేళ్లైనా నష్టపరిహారం చెల్లించడం లేదని రైతన్నలు ఎమ్మెల్యేకు విన్నవించారు. వారం రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతూ, రోడ్లపై నిరసనలు తెలియజేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కర్షకులు వాపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడల్లా ముంపునకు గురై నష్టపోతున్న రైతుల సమస్యలను వినతి పత్రాల ద్వారా తెలియజేశాం. మంథని నియోజకవర్గానికి సంబంధించి గోదావరి నీటిని, ఇసుకను రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దామరకుంట, సుందిళ్ల వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి మంథని నియోజకవర్గంలోని గ్రామాలకు నీరు అందించిన తర్వాతనే వేరే ప్రాంతాలకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు విన్నవించాం. సాంకేతికపరంగా సరైన అధ్యయనం చేయకుండా ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం ద్వారా అనేక మంది రైతుల పొలాలు మూడేళ్లుగా నీటిలో మునిగిపోయి కష్టాలు పడుతున్నారు. అయినా రాష్ట్రప్రభుత్వం పంట నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వలేదు. రెండేళ్లుగా ఎలాంటి సాయం అందలేదు. నీటి నిల్వల ద్వారా జరుగుతున్న పంటనష్టాన్ని తక్షణమే చెల్లించాలి. దీనిపై సీఎం స్పందిచాలని కోరుతున్నాం.- దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంథని ఎమ్మెల్యే
ముంపునకు గురవుతున్నాయి..
ప్రాజెక్టు డిజైన్ సాంకేతికపరంగా సరైన అధ్యయనం చేయకపోవడం వల్ల మంథని నియోజకవర్గంలోని మహదేవ్ పూర్, సూరారం, బెగ్లూర్, బ్రాహ్మణపల్లి, కుదురుపల్లి ,ఆరెంద, వెంకటాపూర్, ఖాన్సాయిపేట గ్రామాల రైతుల భూములు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. ఇక్కడి ప్రాంతంలోని రైతులకు మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదన్నారు. నియోజకవర్గంలో నత్తనడకన కొనసాగుతున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. డీపీఆర్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మొదట నీరు ఇవ్వాలని కోరారు. వచ్చే బడ్జెట్లో నిధులు విడుదల చేసి పనులు సకాలంలో పూర్తి చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ముంపునకు గురైన పొలాలను గుర్తించి రైతులకు వెంటనే రెండేళ్ల నష్టపరిహారాన్ని అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : 'విద్వేష ప్రసంగాలు తప్ప సంజయ్ చేసిందేమీ లేదు'