కొవిడ్-19 నియంత్రణ, నివారణ చర్యల్లో ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోయిందని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శించారు. వైరస్ నివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కరోనాపై ప్రజల్లో అనేక సందేహాలు ఏర్పడి భయాందోళనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మూడు నెలలు కావొస్తున్నా రాష్ట్రంలో మహమ్మారి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టకపోవడం దురదృష్టకరమని ఆరోపించారు.
హైకోర్టు చెప్పినా ప్రజలకు కరోనా వివరాలు తెలుపకుండా ప్రభుత్వం గోప్యంగా ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొవిడ్ నిర్ధారణ అయిన వ్యక్తులకు ప్రత్యేకంగా చికిత్స అందించకుండా, ఇంటిలోనే ఉండాలనడం వలన చిన్న చిన్న ఇళ్లలో ఉండే పేదవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లాలో మండలానికి ఒక్కటయినా ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. కరోనా వ్యాధికి సంబంధించిన మందులను ప్రజలందరికీ సమానంగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వైరస్ పరీక్ష నుంచి చికిత్స పూర్తయ్యేవరకూ వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తులకు మేమున్నామని ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు