పెద్దపల్లి జిల్లా మంథనిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మంథని మండలంలోని 34 గ్రామపంచాయతీలతో పాటు పాత మంథని గ్రామ పంచాయతీని కలుపుకొని మొత్తం 35 ఆడిటింగ్ రికార్డులను పరిశీలించారు. ప్రతి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.
అధికారుల నిర్లక్ష్యం
రెండేళ్ల పనులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసినట్లు పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వినోద్ తెలిపారు. కొవిడ్ వల్ల కాస్త ఆలస్యమైందని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో 18 గ్రూపులు పాల్గొన్నాయని వెల్లడించారు. కొందరు ప్రతిసారి చేసే తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిధుల దుర్వినియోగం
మంథని మండలానికి రూ.13,77,84,703 వేతనాలుగా, రూ.4,32,38,521 మెటీరియల్ కోసం మొత్తంగా రూ.18,10,23,224లను కేటాయించామని తెలిపారు. రూ.5,79,282 నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించినట్లు వెల్లడించారు.
షోకాజ్ నోటీసులు
విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారికి కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులు ఇచ్చి... తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంథని మండలంలో ఈ ఏడాది అధిక సంఖ్యలో కార్మికులను వాడుకోవాలని ఆదేశించినట్లు వివరించారు. ఈ తనిఖీల్లో మంథని ఎంపీపీ కొండా శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత, ఎంపీడీవో వెంకట చైతన్య, సిబ్బంది, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవోలు.. జగన్పై 'చంద్ర' నిప్పులు