పెద్దపల్లి జిల్లా రామగుండంలో రెండు దశాబ్దాల క్రితం ఖాయిలా పడిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో ఇకపై రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుంది. సుమారు 5,254 కోట్ల అంచనాలతో నిర్మాణం చేపట్టగా... కరోనా సహా వివిధ కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరగడంతో వ్యయం 6,180 కోట్లకు చేరుకుంది. ఎఫ్‌సీఐతో పాటు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం గెయిల్, డెన్మార్క్‌కు చెందిన హాల్డర్టాప్ సంస్థల భాగస్వామ్యంతో ఈ కర్మాగార నిర్మాణ పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం వాటాతో పాటు నీరు, విద్యుత్, సరఫరా, రవాణా కోసం రహదారి నిర్మాణం పనులు చేపడుతూ సహకారం అందించింది.
తితిదేకు.. భారీ యూరియా విరాళం..
గతంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాను స్వస్తిక్ బ్రాండ్‌తో విక్రయించేవారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న వేపనూనె పూత యూరియాను కిసాన్ బ్రాండ్‌తో మార్కెటింగ్ చేస్తున్నారు. చిన్న చిన్న లోటుపాట్లను సరిచేసిన అనంతరం ప్రధాని ఈ పరిశ్రమను జాతికి అంకితం చేయనున్నారు. ఫిబ్రవరి 28న ట్రయల్ రన్‌ను కంపెనీ సీఈఓ నిర్లిప్సింగ్ రాయ్ ప్రారంభించారు. నెల తర్వాత ఉత్పత్తి ప్రారంభం కాగా తొలి 30 టన్నులను తితిదేకు విరాళంగా పంపించి రెండో విడతలో కరీంనగర్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.
యూరియాకూ డిమాండ్ పెరుగుతోంది..
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు జలాల కారణంగా.. వ్యవసాయం పెరుగుతుండటంతో, యూరియాకూ డిమాండ్ పెరుగుతోందని రైతులు, వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా చివరకు యూరియా కొరతతో ఆందోళన తప్పేది కాదంటున్నారు అన్నదాతలు. రామగుండం కర్మాగారంలో ఉత్పత్తి మొదలవ్వడంతో... తొలుత రాష్ట్రానికి యూరియా సరఫరా చేసి.. తర్వాతనే ఇతర రాష్ట్రాలకు తరలించే ఆస్కారం ఉందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉత్పత్తి అయ్యే యూరియా, ఇతర ఉత్పత్తులను.. కంపెనీలో వాటాదారుగా ఉన్న నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ పర్యవేక్షిస్తోంది.
ఇదీ చదవండి: బయోటెక్ కంపెనీలతో సీఎస్ఐఆర్- ఐఐసీటీ ఒప్పందం