జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో గోదావరి ఉద్ధృతి తగ్గినా.. చేసిన నష్టం మాత్రం లెక్కలేసుకోలేని పరిస్థితిని కల్పించింది. ధర్మపురిలో నది తీరాన ఉన్న ప్రాంతాలు నీటమునిగాయి. అనూహ్యంగా రాత్రికి రాత్రి వరద నీరు పోటెత్తడంతో.. ప్రజలు, చిరు వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. గతంలో ఎన్నడూ పట్టణంలోకి గోదావరి జలాలు రాకపోవడంతో అధికార యంత్రాంగం కూడా అంచనా వేయలేకపోయింది.
నిత్యావసర సరుకులు, గృహోపకరణ వస్తువులు, ఇతర విలువైన వస్తువులూ వరద నీటిలో కొట్టుకుపోయాయి. గోదావరి ఒడ్డున మంగలి ఘాట్ వద్ద చిరు వ్యాపారుల వస్తువులు కొట్టుకుపోవడంతో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 144 ఇళ్లు స్వల్పంగా శిథిలం కాగా.. 36 ఇళ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టినా.. ఆర్థికంగా మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలిందని చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమను ఆదుకోవాలంటూ ధర్మపురి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలకు ఎగువ నుంచి గోదావరి నదికి చేరిన భారీ వరద మంథనిలో జలప్రళయం సృష్టించింది. సుమారు 35 ఏళ్ల క్రితం మంథని పట్టణంలో వరద బీభత్సం తర్వాత.. అంతటి ప్రళయం ఇప్పుడే వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. మంథని పట్టణంలోని చాలా ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ఉద్ధృతి పెరగడంతో కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిపోయారు. వరద ఉద్ధృతి తగ్గిన అనంతరం ఇళ్లకు రావడంతో తమ వస్తువులన్ని నీట మునిగాయని, నిత్యావసర సరకులూ నాశనమయ్యాయని, చిరు వ్యాపారాలు దెబ్బ తిన్నాయని, లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి..
గోదావరి ఉగ్రరూపం.. ప్రళయం తప్పదా..!!
గోదావరి ఉద్ధృతి.. ఏకమైన ఊరు-ఏరూ.. డ్రోన్ దృశ్యాలు మీరూ చూడండి!
స్టంట్ పేరుతో నదిలోకి జంప్.. తిరిగిరాని యువకుడు.. వీడియో వైరల్!