దీపావళిని(diwali celebration 2021) పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. పవిత్ర నదీ స్నానాల కోసం ఉదయం నుంచే తరలివచ్చారు. గోదావరిలో స్నానమాచరించి... పవిత్ర జలాలను ఇంటికి తీసుకెళ్లారు. దీపావళి రోజు ప్రత్యేకంగా కేదారేశ్వర నోములు నోచుకుంటారు. ఇందుకోసం గోదావరి ఇసుకతో శివలింగాలను తయారు చేసుకుని పూజించడం భక్తుల ఆనవాయితీ. పవిత్రస్నానం తర్వాత శ్రీ గౌతమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇసుకకు డిమాండ్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత గోదావరి నదిలో సంవత్సరం పొడవునా నీరు నిల్వ ఉంటుంది. ఫలితంగా ఇసుక దొరకకపోవడంతో... స్థానికంగా డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా మంథని గోదావరి తీరం వద్ద రూ.20 చొప్పున డబ్బా ఇసుకను అమ్ముతుండడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇసుక దొరకక కొందరు భక్తులు డబ్బాల చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
ప్రత్యేక పూజలు
గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు... నదీమ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు చేస్తున్నారు. గోదావరి ఒడ్డున ఇసుకతో శివలింగాలను తయారుచేసి... కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పిస్తున్నారు. ప్రాచీనమైన శ్రీ గౌతమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కేదారేశ్వర నోముకు అవసరం అయ్యే ఇసుక, మర్రి ఆకులు, మర్రి ఊడలు ఇతర పూజా సామాగ్రిని గోదావరి నదీ తీరం ఒడ్డున భక్తులకోసం విక్రయిస్తున్నారు.
ఇదీ చదవండి: Naga shaurya farm house case: 'పేకాడదాం రండి'.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన కార్డులు