పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్లోని వరి ధాన్యం అకాల వర్షంతో కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రం దగ్గర నుంచి ఎస్ఆర్ఎస్పీ కాలువ వెళ్తుంది. శాస్త్రుల పల్లె చెరువు నింపటానికి అధికారులు ఈ కాలువ ద్వారా కొన్ని రోజుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి అడ్డంగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు మట్టిపోసి... లారీల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.
రాత్రి కురిసిన అకాల వర్షానికి తోడు ఎస్ఆర్ఎస్పీ కాలువలో ప్రవహిస్తున్న నీరు పోటెత్తి రైతులు ఆరబోసిన ధాన్యం వైపు ప్రవహించింది. దీంతో సుమారు నలుగురు రైతులకు సంబంధించిన 40 సంచుల వరి ధాన్యం కొట్టుకుపోయింది. అధికారుల అలసత్వం వల్లే ధాన్యం కొట్టుకుపోయిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్పందించిన జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు... పరిహారం వచ్చేలా ప్రయత్నం చేస్తానని రైతులకు తెలిపారు.
ఇదీ చదవండి: ఖర్చులు తగ్గించే ఐదు అద్భుత ఐడియాలు