గంగపుత్రుల సమస్యలను పార్లమెంట్ వేదికగా రాజ్యసభలో వినిపించిన జయప్రకాశ్ నిశాద్కు విల్లేపార్లేలో ముంబయి గంగపుత్ర ఐక్యత సంఘం పాలాభిషేకం చేసింది. ఈ సందర్భంగా ముంబయి మహానగర పరిధిలోని గంగపుత్ర కులస్థులు పెద్ద ఎత్తున హాజరై సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బట్టు గణేశ్‌ను ఎన్నుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసం ఇతర కులాలకు మత్స్య వృత్తిలో హక్కులు కల్పించడంపై ముంబయి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు, అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు బట్టు గణేశ్ గంగపుత్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకారులు వేలాది ఏళ్లుగా చేపలు పడుతున్న విషయం గుర్తు చేశారు. ఈ సందర్భంగా సంఘం తరఫున రాజ్యసభ సభ్యుడు జయప్రకాశ్ నిషాద్కు కృతజ్ఞతలు తెలియజేశారు. గంగపుత్రులకు అండగా నిలిచే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గంగపుత్ర సమస్యలపై స్పందించి శాసనసభ దృష్టికి తీసుకువెళ్లారని ముంబయి గంగపుత్ర ఐక్యత సంఘం అధ్యక్షుడు మంచెర్ల మల్లేశ్ గంగపుత్ర తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో " గంగపుత్రులు- వారి మత్స్య హక్కుల పునరుద్ధరణ " అనే అంశంపై తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గంగపుత్ర సమస్యలను శాసనసభ వేదికగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పురపాలికల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్: కేటీఆర్