పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోని వాహనాల పార్కింగ్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం పార్కింగ్ స్థలంలో కొంత మంది వ్యక్తులు ఉండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు కొంతమంది మూడు ద్విచక్ర వాహనాలను బయటికి తీశారు. అనంతరం స్థానికులతోపాటు అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను ఆర్పారు.
పార్కింగ్ సిబ్బంది ఎక్కడ...
పార్కింగ్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థరణకు వచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేష్, సీఐ మహేందర్ రెడ్డి , ఏసీపీ హబీబ్ ఖాన్ వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.