పెద్దపల్లి జిల్లా మంథని ప్రధాన చౌరస్తాలో పంటపొలాలకు చివరి దశలో ఎస్సారెస్పీ నీరు రావడం లేదని భాజపా ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. వేల రూపాయలు అప్పులు తీసుకొచ్చి యాసంగి పంటకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గంలోని కాకర్లపల్లి, గాజులపల్లి, మైదుపల్లి, సూరయపల్లి, బిట్టుపల్లి, ధర్మారం, ఖమ్మం పల్లి, సీతంపల్లి తదితర గ్రామాల ఆయకట్టుకు నీరు అందడం లేదన్నారు. తద్వారా పొలాలు ఎండిపోతున్నాయన్నారు. మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా ఈ ప్రాంతానికి చుక్కనీరు రావడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పంటలకు సరిపడా నీరు అందిస్తామని చెప్పి.. పంట చేతికందే సమయంలో నీరు రాక నష్టపోతున్నామని అధికారులకు తెలిపినా న్యాయం జరగడం లేదన్నారు. పంట పొలాలకు నీరు అందకుంటే రైతుల ఆత్మహత్యలే శరణ్యమన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఈ ప్రాంతం చివరి ఆయకట్టు వరకు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి : పుచ్చ సాగులో సిరులు కురిపిస్తున్న యువరైతు