కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు అనుసంధానిస్తూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పెద్దపెల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా మారనుంది. అయితే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు. 2014లో ప్రాజెక్టు పూర్తయినా నేటికీ రోడ్డు లేకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏడున్నర కోట్లతో చేపట్టిన తారు రోడ్డు పనులు రెండేళ్లుగా కొలిక్కి రావడం లేదు.
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు వెళ్లే రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు మట్టి గుంతల్లో నీరు నిండి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కరకట్ట నుంచి ఆనకట్ట వరకు మట్టి రోడ్డుపై వర్షపు నీరు నిలుస్తోంది. మరోవైపున మంచిర్యాల జిల్లా గుడిపేట వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రాజెక్టు రహదారి నిర్మాణం పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.