పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్య కిడ్నాప్ కల్పితమని పోలీసులు తేల్చారు. భూమి కొనుగోలు కోసం ఇంటి నుంచి రూ.50లక్షలు తీసుకొని బయటకు వెళ్లారని డీసీపీ రవీందర్ వెల్లడించారు. విచారణంలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయగా... పొంతన లేని సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు. అనుమానం వచ్చి లోతైన విచారణ జరపగా అసలు విషయం బయటపడిందని వివరించారు.
అంతా నాటకం
నాలుగు ఏళ్ల క్రితం భూమి కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఓ వ్యక్తికి రూ.36 లక్షలు ఇచ్చామని నిందితులు చెప్పారని డీసీపీ తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యజమాని నుంచి డబ్బులు తిరిగి రాబట్టుకునే ప్రయత్నంలో ఈ నాటకమాడినట్లు తెలిపారని వెల్లడించారు.
కఠిన చర్యలు
కిడ్నాప్ నాటకమాడి పోలీసుల సమయాన్ని వృథా చేసి... స్థానికులను భయబ్రాంతులకు గురి చేసిన ఆ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవిందర్ తెలిపారు. ఈ నాటకాన్ని ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేశారు.
ఇదీ చదవండి: కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి