దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలతో తెరాస, భాజపాలు ప్రజలను మోసం చేస్తున్నాయని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు శ్రీధర్‌బాబును కలిశారు. మూతబడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించేలా చూడాలని వినతిపత్రం అందించారు.
ప్రజా సంరక్షణలో దేశంలో భాజపా, రాష్ట్రంలో తెరాసలు పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్యే విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో యువతకు ఏ విధమైన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న ఆయన.. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిని సైతం ఇవ్వడం లేదంటూ దుయ్యబట్టారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు లేకనే సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. సునీల్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం హడావిడిగా పాఠశాలలు, కళాశాలలను తెరిపించి, ఎన్నికలు ముగియగానే మూసేయడం బాధాకరమన్నారు. మూతపడిన పాఠశాలలను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేటు అధ్యాపకులు ఉపాధి కోల్పోతున్నారని, వారి పరిస్థితి గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.