పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీబీజీకేఎస్ కేంద్ర కార్యలయంలో కార్యకర్తల విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్లో జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడుతుండగా.. ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కొంత మంది సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సమావేశం ఒక్కసారిగా రసభాసగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
సింగరేణిలో యూనియన్ బలోపేతం చేయడానికి యువ కార్మికులతో 11 డివిజన్లలో సోషల్ మీడియా వింగులు ఏర్పాటు చేయాలని గౌరవ అధ్యక్షురాలు కవిత సూచన మేరకు... యూనియన్ కోశాధికారి వెంకటేశ్ తనకు సంబంధించిన బయటి వ్యక్తులను సమావేశానికి తీసుకొచ్చారు. తమను కాదని బయటి వ్యక్తులను ఎలా తీసుకొస్తారని యువ కార్మికులు నిలదీశారు. ఈ క్రమంలో సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
అధ్యక్షుడు వెంకట్రారావు ఎంత వారించినా సభ్యులు వినలేదు. కొంత మంది సంఘాన్ని విచ్చిన్నం చేస్తున్నారని ఇది సరైంది కాదని ఆరోపించారు. అరుపులు, కేకల మధ్య సమావేశాన్ని అధ్యక్షుడు వెంకట్రావు.. మధ్యలోనే ముగించి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉంటే.. రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో అని కార్మిక సంఘం నాయకులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి సమావేశంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు గొడవలకు దిగడం కొసమెరుపు.