పెద్దపల్లి జిల్లాలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ భారతి హోళీకేరి పేర్కోన్నారు. గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పనులు వేగవంతంగా జరగడానికి దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 10 నాటికి జిల్లాలో ఉన్న 54 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నర్సరీ, డంపింగ్ యార్డు, ట్రాక్టర్ ట్యాంకర్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్ ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో రైతుల సౌకర్యార్థం రూ.16.67 కోట్లతో కళ్లాలు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఉపాధి హామీ నిధులతో ఎస్సారెస్పీ కాల్వల మరమ్మత్తు పనులు, పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హరిత ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామ ప్రజలను భాగస్వామ్యం చేస్తు గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు.
ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష