పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన లచ్చమ్మ స్థానికంగా ఉన్న వేణుగోపాల స్వామి గుడిలో నివసిస్తోంది. ప్రతిరోజూ గుడిమెట్లపై కూర్చొని.. అక్కడకు వచ్చే భక్తుల వద్ద చిల్లర తీసుకుంటూ జీవనం సాగిస్తోంది. బుక్కెడు బువ్వ కోసం తాను రోజూ పడుతున్న బాధను.. తోటివారికి ఒక్కపూటైనా దూరం చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా తాను ఇన్ని రోజుల నుంచి పోగేసుకున్న 2వేల రూపాయలతో అన్నదానం చేసేందుకు నిర్ణయించుకుంది.
వేణుగోపాల సామి గుళ్లె సాకిరి చేస్త. భక్తులిచ్చిన పైసలు కుప్ప చేసి అన్నదానం పెట్టిన. నా పానం బాగలేక నేను మొక్కుకున్న. ఆళ్లతోని నేను కూడా అన్నం తీసుకున్న. ఆళ్లతోని నేను పేదదాన్నే. అనాథను. పక్షిని. ఎవ్వళ్లేరు ఎనుకముందు. గోపాలసామి గుళ్లె జీతం సుత లేదు. లేకున్నగాని నేను రెండు వేలు జమ చేసి ఇచ్చిన అన్నానికి. - చాట్ల లచ్చమ్మ, యాచకురాలు
ఓ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో గురువారం 25 మందికి అన్నదానం చేసింది. యాచకురాలు లచ్చమ్మ చేసిన సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. గత కొద్ది రోజుల క్రితం తాను అనారోగ్యానికి గురికాక ఇటీవలే కోలుకున్నానని... ఆ సందర్భంగానే ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు యాచకురాలు లచ్చమ్మ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించారు.
ఇదీ చూడండి: kishan Reddy: కల్నల్కు నివాళి అర్పించి.. పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో టిఫిన్ చేసి