పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంథని మున్సిపల్ కార్మికులు, ప్రజలతో కలిసి పలు వీధుల్లో తిరిగి చెత్త, ప్లాస్టిక్‌ను ఏరి వేశారు. కూరగాయల మార్కెట్లో పరిసరాలను పరిశీలించి ప్లాస్టిక్ వినియోగాన్ని తెలుసుకున్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథీన్ వాడాలని సూచించారు.
కూరగాయల అమ్మకం దారులు శాసనసభ్యులకు మార్కెట్లోని సమస్యలను తెలిపి పరిష్కరించాలని కోరారు. ప్లాస్టిక్ అనేది ఒక భూతమని, ప్రజలు ఇంటి ముందు చెత్త వేయొద్దని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 'నేను ఎమ్మెల్యేను కానని మీలో ఒక పౌరుడినే' అని ఈ సందర్భంగా స్థానికులతో శ్రీధర్ బాబు అన్నారు.
తడి, పొడి చెత్తను వేరు వేరుగా డంపింగ్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇళ్లు, పరిసరాలు శుభ్రంగా ఉంటేనే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. మంథని పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య