ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. తెరాస ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయడం వల్ల రాజకీయంగా హడావుడి మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు ఊహించే లోపు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. దీంతో మిగిలిన సభ్యులను కాపాడుకోవడం ప్రతిపక్ష పార్టీలకు తలకు మించిన భారంగా మారుతోంది. ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ఇక్కడి నుంచి బరిలోకి దిగినందున... ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. గెలిచేందుకు కావాల్సిన బలం ఉన్నప్పటికీ... భారీ మెజార్టీయే లక్ష్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇతర పార్టీల సభ్యులపై ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తూ... అడగడమే ఆలస్యం అన్నట్టు ఇప్పటికే పలువురు కారెక్కేశారు. పోలింగ్ నాటికి మరింత మందిని తమ వైపు తిప్పుకొనేలా పావులు కదుపుతున్నారు. కారు జోరు ఆపేందుకు ప్రతివ్యూహాలు అవసరమని భావిస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది.
కేటీఆర్ దిశానిర్దేశం..
అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. సమయం తక్కువగా ఉండటం వల్ల పార్టీలన్నీ ఎన్నిక మీద దృష్టి పెట్టాయి. మిగతా పార్టీల కంటే తెరాస ముందే ఉంది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... ఉపఎన్నిక నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని క్యాడర్‌కు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఉప ఎన్నిక అభ్యర్థి కవిత సమావేశమై ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎన్నికల నాటికి మరింత మందిని చేర్చుకొనేందుకు తెరాస నేతలు వ్యూహాలు రచిస్తుండగా... ప్రతిపక్షాలు ఎలాంటి ప్రతివ్యూహాన్ని అనుసరిస్తాయోనన్న చర్చ సాగుతోంది. అయితే తెరాస అధిష్ఠానంపై ఉన్న వ్యతిరేకతతో ఓట్లు వస్తాయని ప్రతిపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెరాసకే ఆధిక్యం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 824మంది ఓటర్లు ఉండగా... ఇద్దరు మృతి చెందినందున 822 మందితో ఓటరు జాబితా తయారైంది. తెరాస నుంచి గెలుపొందిన వారు 505, ఎంఐఎం 28, కాంగ్రెస్ 140, భాజపా 84, స్వతంత్రులు 66 మంది ఉన్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా... కాంగ్రెస్‌కు చెందిన భిక్కనూరు, దోమకొండ, పిట్లం, ఎల్లారెడ్డి, ఏర్గట్ల, భాజపాకు చెందిన నందిపేట్ జడ్పీటీసీ సభ్యులు తెరాసలో చేరారు. పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు కూడా పదుల సంఖ్యలో గులాబీ కండువా కప్పుకొన్నారు. అలాగే 13 మందిఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు.
గెలవాల్సిందే..
పార్లమెంటు స్థానాన్ని కోల్పోయినప్పటికీ... ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాల్లో తెరాస ఎమ్మెల్యేలే ఉన్నారు. స్థానిక సంస్థల్లోనూ 80శాతం పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. కొన్ని చోట్ల మాత్రమే భాజపా, కాంగ్రెస్ విజయం సాధించాయి. పెద్ద సంఖ్యలోనే గెలిచిన స్వతంత్రులు... ఒక్కొక్కరుగా గులాబీ గూటికి చేరుతూనే ఉన్నారు. అధికార పార్టీ ఆకర్ష్‌తో ప్రతిపక్షాలకు గండి పడుతున్నా... అడ్డుకునే పరిస్థితి లేకుండా పోతోంది. భాజపా నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్‌తోపాటు రాష్ట్రస్థాయి నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి ఉన్నా... వలసలు ఆపలేకపోతున్నారు.
ఇదీ చూడండి: వరుస ఎన్నికలపై కారు నజర్.. పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ