నిజామాబాద్ జిల్లాలో శిక్షణ సివిల్ సర్వీస్ అధికారులు పర్యటించారు. 12 మంది సివిల్ సర్వీస్ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి ఇందల్వాయి మండలం సిర్నాపల్లి, కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి, ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామాలకు వెళ్లారు. వారం రోజుల పాటు పల్లెల్లో ఉండి ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులు తెలుసుకోనున్నారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో ఉద్యోగాలు సాధించిన వీరంతా పల్లెల పరిశీలనకు వచ్చారు.
ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామానికి వచ్చిన అధికారులను 'ఈటీవీ భారత్' పలకరించగా వారి వ్యక్తిగత విషయాలతో పాటు నాలుగు రోజులుగా తాము గమనించిన అంశాలను పంచుకున్నారు. గ్రామస్థులు తమతో ఆప్యాయంగా, గౌరవప్రదంగా మెలుగుతున్నారని, యువ పాలకవర్గం అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు పక్కాగా అమలు చేస్తుందని కితాబిచ్చారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు వివరించేందుకు గ్రామస్థులు ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.
మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి బతుకమ్మ ఆడారు. విద్యార్థులతో ముచ్చటించారు. పర్యావరణ ప్రాధాన్యతను గ్రామస్థులకు వివరించారు. పాలిథిన్ నిర్మూలన, గ్రామాభివృద్ధి కోసం రూపొందించిన విజన్ డాక్యుమెంట్, మియావాకి విధానంలో చేపట్టిన మొక్కల పెంపకం, గ్రామస్థులకు తాగునీరు, రహదారుల నిర్వహణ తదితర అంశాలు చాలా బాగున్నాయని చెప్పారు.
ఇదీ చదవండి: ఉత్కంఠగా సాగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్