
చుక్ చుక్ రైలు వస్తోంది.. ఆగినాక ఎక్కండి అనే పాట మనందరికీ తెలుసు.. అయితే చుక్ చుక్ రైలు వస్తోంది ఆగినాక తినండి అంటే కొత్తగా ఉంది కదూ.! నిజామాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన జంక్షన్ 65 రెస్టారెంట్లో అదే ప్రత్యేకత.. అన్ని హోటళ్లలో మనుషులు ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తే.. ఇక్కడ ఓ రైలు బండి మనకు కావాల్సిన పదార్థాలను చేరవేస్తోంది.

ఈ హోటల్ ప్రవేశంలో ఏర్పాటు చేసిన రైలు బోగి వినియోగదారులకు స్వాగతం పలుకుతోంది. టేబుల్ వద్ద కూర్చున్న తర్వాత వారు కోరిన ఆహారాన్ని రైలు పెట్టెలు తీసుకొచ్చి ఇస్తాయి. కొత్తదనం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ఈ హోటళ్లో చిన్నపిల్లలు ఆనందంగా గడుపుతున్నారు. రైలు బండిని చూస్తూ సంతోషంగా రుచులను ఆస్వాదిస్తున్నారు. పిల్లలు ఇంట్లో అన్నం తినేందుకు మారాం చేస్తారని ఇక్కడికి వస్తే కడుపునిండా తింటుండటంతో పాటు ఆనందంగా గడుపుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే చూడగలిగే ఇలాంటి సాంకేతికతను కార్తిక్ అనే వ్యక్తి నిజామాబాద్‌కు పరిచయం చేశాడు. జపాన్‌కు చెందిన సాంకేతిక ద్వారా సెన్సర్ టెక్నాలజీతో ఈ చిన్న రైలింజన్ నడుస్తోంది. కిచెన్‌లో ఆహార గిన్నెలు పెట్టే సమయంలో టేబుల్ నెంబర్‌ను నొక్కడం ద్వారా ఆహారం ఏ టేబుల్‌కు అందించాలో అక్కడికి చేరుతుంది. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 14 ఫేక్ రుణాల యాప్‌లు.. అదుపులో నిందితులు