TU VC Ravinder Caught by ACB Officials in Hyderabad : ఓ ప్రైవేటు కళాశాలలో పరీక్షా కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో శ్రీ షిర్డీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీలో గతంలో డిగ్రీ పరీక్ష నిర్వహణ కేంద్రముండేది. కొంతకాలం క్రితం రద్దు చేయగా.. దాన్ని పునరుద్ధరించాలంటూ వీసీ రవీందర్‌ను సొసైటీ అధ్యక్షుడు దాసరి శంకర్ కలిశారు. ఇందుకు వీసీ రూ.50 వేలు డిమాండ్ చేయగా... వారి మధ్య ఒప్పందం కుదరడంతో పరీక్ష కేంద్రం నిర్వహణకు అనుమతి లభించింది.
ACB Officials Inspected TU VC Ravinder's House : ఈ క్రమంలో లంచం సొమ్మును హైదరాబాద్ తార్నాక కమిటీ కాలనీలోని తన ఇంటికి తీసుకురావాలని రవీందర్ సూచించారు. లంచం విషయమై ఉప్పందడంతో అనిశా అధికారులు తార్నాకలో మాటువేశారు. నిన్న ఉదయం శంకర్ నుంచి రవీందర్ డబ్బు తీసుకున్న వెంటనే అనిశా అధికారులు రంగప్రవేశం చేసి... సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాయంత్రం వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు అనిశా అధికారులు సోదాలు నిర్వహించి.. పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రవీందర్‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.
పాలనను గాలికొదిలి.. అక్రమాలకు అడ్డాగా మార్చారు : హైదరాబాద్‌లో అనిశా అధికారుల తనిఖీలు జరుగుతుండగానే... మరో బృందం నిజామాబాద్ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో సోదాలు నిర్వహించింది. వర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అరుణ నుంచి అధికారులు సమాచారం సేకరించారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చిన అంశానికి సంబంధించిన వివరాలు తీసుకున్నట్లు తెలిసింది. కాగా, తనపై జరిగిన అనిశా దాడులపై ప్రస్తుతానికేమీ మాట్లాడలేనని ఉపకులపతి రవీందర్ పేర్కొన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఒక ఉపకులపతి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. ఉపకులపతి రవీందర్ తీరు ఆది నుంచీ వివాదాస్పదంగా ఉంది. విశ్వవిద్యాలయంలో పాలనను గాలికొదిలేశారని.. అక్రమాలకు అడ్డాగా మార్చారని ఆయనపై విమర్శలున్నాయి. సామగ్రి కొనుగోళ్లతో పాటు పొరుగు సేవల సిబ్బంది నియామకాల్లో కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
బడ్జెట్‌కు ఆమోదం లేకుండానే కోట్ల రూపాయలు ఖర్చు : ఉపకులపతిగా రెండేళ్ల పాటు కొనసాగిన రవీందర్.. మూడు నెలలకోసారి జరపాల్సిన పాలకమండలి సమావేశాన్ని ఏడాదిన్నర పాటు నిర్వహించలేదు. పాలకమండలి నియమించిన రిజిస్ట్రార్‌ను తిరస్కరించి తనకు నచ్చినవారిని నియమించుకున్నారు. ఏడాదిన్నర కాలంగా బడ్జెట్‌కు ఆమోదం లేకుండానే రూ.కోట్లు ఖర్చు చేయడంపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి పాలకమండలి నివేదించింది. ఉపకులపతి నిర్ణయాలపై విజిలెన్స్, అనిశాతో విచారణ చేయించాలని తీర్మానించింది. ఈ క్రమంలోనే ఈ నెల 6, 13 తేదీల్లో వర్సిటీలో విజిలెన్స్ దాడులు జరిగాయి.
మంత్రి హెచ్చరించడంతో... రిజిస్ట్రార్ నియామకం : ఉపకులపతిగా రవీందర్ పాల్పడిన అక్రమాలు తాజా విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగు చూశాయని విశ్వసనీయ సమాచారం. ఆయనకు డబ్బులిచ్చినట్లుగా చెబుతున్న వారి వాంగ్మూలాలను సేకరించడంతో పాటు.. ఆయన చేసిన కొనుగోళ్లలో అక్రమాలపైనా ఆరా తీస్తున్నారు. రెండేళ్ల కాలంలో సుమారు రూ.8 కోట్ల సామగ్రి కొనుగోలు చేశారని గుర్తించినట్లు తెలుస్తోంది. పొరుగుసేవల కింద పని చేసే సిబ్బంది ఒకరు మధ్యవర్తిగా ఉండి డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు. పరీక్షల విభాగం నిధులను ఇతరాలకు మళ్లించారనే ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. పొరుగుసేవల సిబ్బందికి పదోన్నతులు కల్పించి నిబంధనలకు విరుద్ధంగా అదనపు జీతాలు చెల్లించటాన్ని గుర్తించారు.
ఉద్యోగుల పేరిట తీసుకున్న అడ్వాన్సుల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలను విశ్లేషిస్తున్నారు. అనిశా దాడికి ఒక రోజు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఉదయం ఉపకులపతితో మాట్లాడిన ఓ మంత్రి.. గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీసీ హైదరాబాద్ నుంచి హుటాహుటిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి చేరుకొని పాలకమండలి నియమించిన ఆచార్య యాదగిరికి రిజిస్ట్రార్‌గా ఉత్తర్వులు అందించారనే ప్రచారం జరుగుతోంది.
ఇవీ చదవండి: