Telangana University Issues : ప్రత్యేక చట్టాలు, స్వయం ప్రతిపత్తితో విశ్వవిద్యాలయాలు పాలన సాగిస్తుంటాయి. విద్యాసంస్థల ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ఉన్నత ప్రమాణాలతో కూడిన పరిశోధన విద్యకు ఈ విధానం దోహదం చేస్తోంది. కానీ తెలంగాణ వర్సిటీలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సమష్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట.. భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి. అధికారాలు సాగిస్తున్న వారి మధ్య ఆధిపత్య పోరు కారణంగా ప్రమాణాల మాట అటుంచితే తరచూ వివాదాలే వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రిజిస్ట్రార్ నియామకం చుట్టూ సాగుతున్న వివాదం, ఇటీవల సమసిపోయినట్టే అనిపించినా క్రమంగా మళ్లీ రాజుకుంది. ఉపకులపతి నియమించిన రిజిస్ట్రార్‌ను పాలక మండలి తిరస్కరిస్తుంటే, పాలకమండలి నియమించిన రిజిస్ట్రార్‌ను వీసీ ఒప్పుకోవడం లేదు. దీంతో రిజిస్ట్రార్ కుర్చీ ఎవరిదో తేలడం లేదు. అసలు వర్శిటీకి రిజిస్ట్రార్ ఎవరోనన్న మీమాంస నెలకొంటోంది.
వీసీగా రవీందర్ గుప్తా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆచార్య కనకయ్యను రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆ తర్వాత జరిగిన పాలక మండలి సమావేశంలో కనకయ్యను తొలగించి ఆచార్య యాదగిరిని నియమించారు. కానీ కొద్దిరోజులకే ఆ బాధ్యతల నుంచి యాదగిరి తప్పుకోవటంతో ఆయన స్థానంలో శివశంకర్ వచ్చారు. అతని నియామకాన్ని సైతం పాలకమండలి ఒప్పుకోకపోవటంతో ఇతర వర్శిటీకి శివశంకర్ వెళ్లిపోయారు. తర్వాత విద్యావర్ధినిని రిజిస్ట్రార్‌గా వీసీ నియమించారు.
పాలకమండలి చెప్పిన అంగీకరించడంలే: గత నెల జరిగిన పాలక మండలి సమావేశంలో ఆమెనూ తొలగించారు. ఈ విషయంపై వీసీ రవీందర్ హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఆ తర్వాత మళ్లీ ఓయూ నుంచి నిర్మలాదేవిని వీసీ రవీందర్ తీసుకొచ్చారు. అయితే రెండు రోజులకే ఆమె తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో మళ్లీ యాదగిరే రిజిస్ట్రార్‌గా కొనసాగుతారని పాలకమండలి చెప్పినా, వీసూ రవీందర్ గుప్తా ఇందుకు అంగీకరించకపోవడంతో వివాదం కొనసాగుతూనే ఉంది.
తప్పించుకోవడానికే అలా చేశారు: రిజిస్ట్రార్ నియామకం విషయంలో వివాదంతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి వర్శిటీలో తలెత్తింది. పొరుగు సేవల ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రిజిస్ట్రార్, ఉపకులపతి ఒక్క మాట మీదకు వచ్చి సంతకాలు చేయటంతో సమస్యకు తెరపడింది. ఈ సందర్భంలో పలువురు పాలకమండలి సభ్యులతో ఉపకులపతి సమావేశమయ్యారు. ఇరువురు బయటకు వచ్చాక వివాదం ముగిసినట్లు ప్రకటించారు. అంతా కలిసి వర్సిటీ అభివృద్ధి కోసం పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కానీ, అది ఉద్యోగుల నిరసనలను తప్పించుకోవడానికి అనుసరించిన వ్యూహమని తేలిపోయింది. వీరి మధ్య వివాదం ఇంకా తొలగలేదని సోమవారం వర్సిటీలో జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
విద్యార్థులపై చదువుపై ప్రభావం: కొద్ది రోజుల్లో పరీక్షల నిర్వహణ, ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. పరిపాలనా పరమైన అనేక విషయాలపై నిర్ణయాలు తీసుకోవటానికి ఇది కీలకమైన సమయం కాగా ఇక్కడ మాత్రం ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. ఉద్యోగులేమో ఎవరి మాట వినాలో తెలియక ఆయోమయానికి గురవుతున్నారు. గ్రూపులు కట్టి, వర్గాలుగా విడిపోయి వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఇవి పాలనాపరమైన వ్యవహారాలపై ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. త్వరితగతిన వివాదానికి పరిష్కారం చూపేలా చొరవ చూపాలని విద్యావంతులు కోరుతున్నారు
నియమించే అధికారం మాకే ఉంది: పాలకమండలి నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి ఆ పదవిలో కొనసాగాలంటే ఉత్తర్వు కాపీ ఉండాలని, అప్పటి వరకు తనను రిజిస్ట్రార్‌గా పరిగణించలేమని వీసీ వాదిస్తున్నారు. పైగా ఆయన నియామకంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని చెబుతుండగా, పాలకమండలి ఇందుకు భిన్నంగా వాదిస్తోంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.. 55వ ఈసీ సమావేశంలోని తీర్మానాల అమలుపై మాత్రమేనని పేర్కొంటోంది. తాము 57వ సమావేశంలో మరోసారి యాదగిరిని నియమించామని చెబుతోంది. తెలంగాణవర్సిటీ చట్టం ప్రకారం రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం తమదేనని పేర్కొంటోంది. వీసీ నియమించిన వారిని ఈసీ... ఈసీ నియమించిన వ్యక్తిని వీసీ అంగీకరించరు. ఇలా భిన్నవాదనలతో రిజిస్ట్రార్ హోదా వర్సిటీలో వివాదంగా మారింది.
ఇవీ చదవండి: