Students Excelling In Hockey Game At Thumpally: తూంపల్లి గ్రామం నిజామాబాద్ జిల్లాలోని మారుమూల పల్లె. వారికి హాకీ అంటేనే తెలియదు. అలాంటి ఊరి పాఠశాలకి సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు సడక్ నగేశ్. హాకీ అంటే తెలియని వారికి జాతీయ స్థాయి పోటీల వరకు తీసుకెళ్లాడు. జిల్లా టీంలో ఉండే సభ్యుల్లో దాదాపుగా 75 శాతం క్రీడాకారులు ఆయన చేతిలో శిక్షణ పొందినవారే ఉంటున్నారు.
ఆర్మూర్‌కు చెందిన సడక్ నగేశ్ 2015లో తూంపల్లి జడ్పీహెచ్ పాఠశాలకు పీఈటీగా వచ్చారు. గతంలో హాకీ క్రీడాకారుడైన నగేశ్ పాఠశాలకు వచ్చే నాటికి కనీస ఆటలు ఆడే పరిస్థితి లేదు. మైదానం అందుబాటులోకి తీసుకొచ్చి, పిల్లలకు హాకీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. శిక్షణ ఇచ్చేందుకు కనీసం స్పోర్ట్స్ డ్రెస్‌లు, హాకీ స్టిక్స్, బాల్స్ కూడా లేని సమయంలో సొంత ఖర్చులతో పిల్లలకు హాకీ వస్తువులు అందించాడు. ఎక్కడ టోర్నీ జరిగినా తూంపల్లి విద్యార్థులు లేని జట్టును ఊహించలేనంతగా ఈ విద్యార్థులు రాణిస్తున్నారు. హాకీ అంటే తూంపల్లి.. తూంపల్లి అంటేనే హాకీ అనేంత పేరు సంపాదించింది వీరి జట్టు. దేశం తరుఫున తన విద్యార్థులు ప్రాతినిధ్యం వహించేలా తయారుచేయడమే తన ఆశయమని నగేశ్ అంటున్నాడు.
బుక్ విత్ స్టిక్ అనే నినాదంతో ఇక్కడ విద్యార్థులు పాఠశాలకు వస్తారు. ఇంటి నుంచి పాఠశాలకు వచ్చేటప్పుడు పుస్తకాలతో పాటు హాకీ స్టిక్ సైతం తెచ్చుకుంటారు. పాఠశాల వేళలతో పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు. ఇందుకోసం పీఈటీ నగేశ్ ఉదయం ఆరింటికే పాఠశాలకు వస్తాడు. అలా మట్టి గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అనేక సార్లు గాయాలైనా.. విద్యార్థులు వెనుకంజ వెయ్యలేదు.
తమ పిల్లలు హాకీ క్రీడలో రాణిస్తూ సాయ్, సాట్స్ అకాడమీల్లో స్థానం సంపాదించారు. దీని అంతటికీ కారణం నగేశ్ ఇక్కడకు రావడమే అని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తూంపల్లి పేరు జాతీయ స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తోన్న విద్యార్థులకు పంచాయతీ పాలక వర్గం కూడా సహకరిస్తోంది. అటు ఆటల్లోనే కాదు .. ఈ విద్యార్థులు చదువులోనూ ముందుంటున్నారు.
"మన తూంపల్లి పాఠశాల నుంచి ఇప్పటివరకు 200 మందికి పైగా హాకీ పోటీల్లో పాల్గొన్నారు. 65సార్లు జాతీయస్థాయిలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా హాకీ అకాడమీలో అమ్మాయిలు, అబ్బాయిలు తూంపల్లి నుంచి ఉన్నారు. ఈ స్కూల్లో 180 మంది విద్యార్థులు ఉంటే దాదాపు 175 మంది పిల్లలు హాకీని ఆడుతారు. ఎప్పటికైనా తూంపల్లి విద్యార్థులు దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని కోరిక మదిలో ఉంది." - సడక్ నగేశ్, పీఈటీ, జడ్పీహెచ్‌ఎస్ తూంపల్లి
ఇవీ చదవండి: