'ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రకటనతో.. ఇండియాకు టికెట్ బుక్ చేసుకుని బయలుదేరిన కాసేపటికే బాంబుల మోత వినపడింది. అయినప్పటికీ ఎక్కడా ఆగకుండా.. వందల కిలోమీటర్లు నడుచుకుంటూ, క్యాబ్‌ల్లో ప్రయాణిస్తూ.. నానా అగచాట్లు పడ్డాను. రెండు రోజులు ఆహారం లేదు.. బిస్కెట్లు, నీళ్లతో కడుపు నింపుకొన్నాం. మొత్తానికి ఎన్నో అవస్థలు పడుతూ స్వస్థలానికి చేరుకున్నా'మని తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చారు కామారెడ్డి జిల్లాకు చెందిన సచిన్ గౌడ్.
బిక్కుబిక్కుమంటూ గడిపాం
"యుద్ధం ప్రకటన తర్వాత.. ఇండియాకు తిరుగు ప్రయాణం అవుదామంటే విమానాలు లేవు. ఏం చేయాలో తోచక అందరం కలిసి.. రైలు మార్గం ద్వారా బయలుదేరాం. రుమేనియా బార్డర్ దాటడానికి రెండు రోజులు పట్టింది. అక్కడికి వచ్చాక మమ్మల్ని షెల్టర్లలో ఉంచి భోజన సదుపాయం కల్పించారు. రుమేనియా ప్రజలు మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇండియన్ ఎంబసీ సహకారంతో రెండు రోజుల తర్వాత ముంబయికి చేరుకోగలిగాం. అక్కడి నుంచి ఎయిర్ ఇండియా ద్వారా నిన్న రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నాం. ఆ తర్వాత క్షేమంగా ఇంటికి వచ్చాం. మమ్మల్ని సురక్షితంగా స్వస్థలాలకు తరలించిన ఇండియన్ ఎంబసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా"మని యుద్ధ పరిస్థితుల్లో తన ప్రయాణాన్ని వివరించారు నిజామాబాద్ జిల్లాకు చెందిన బానోత్ కార్తిక్.
150 కి.మీ నడక ప్రయాణం
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలానికి చెందిన సచిన్ గౌడ్.. హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో ఎంబీఏ కోర్సు చేసేందుకు ఉక్రెయిన్‌కు ఆరు నెలల క్రితం వెళ్లారు. ఫిబ్రవరి 23 న ఆ దేశంపై రష్యా యుద్ధం ప్రకటించడంతో అప్రమత్తమైన సచిన్, స్నేహితులు.. ఫిబ్రవరి 24న భారత్‌కు తిరిగి ప్రయాణం అయ్యేందుకు టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ టికెట్లు దొరక్కలేదు. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో 150 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసినట్లు సచిన్ తెలిపారు. రెండు రోజుల పాటు బిస్కెట్లు, నీళ్లతో కాలం వెళ్లదీశామని.. నిద్ర కరవై బిక్కుబిక్కుమంటూ గడిపినట్లు చెప్పారు. ఇండియన్ ఎంబసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు వివరించారు. ఉదయం 6.30 గంటలకు స్వగ్రామానికి వచ్చినట్లు తెలిపారు.
తల్లిదండ్రుల హర్షం
తమ కుమారుడు క్షేమంగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలారు. యుద్ధం తొలిరోజు నుంచి.. సచిన్ గురించి బెంగపెట్టుకున్నామని.. అక్కడ ఎలా ఉన్నాడో అని భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మిగిలిన భారతీయ విద్యార్థులను ఇలాగే క్షేమంగా వారివారి స్వస్థలాలకు క్షేమంగా చేర్చాలని విన్నవించారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి పరిధిలోని హనుమాన్ తండాకు చెందిన బానోత్ కార్తీక్ నాయక్.. ఉక్రెయిన్‌లోని ఫ్రాంక్ విస్క్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. యుద్ధ భూమి నుంచి ఈ ఉదయం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తమ కుమారుడు యుద్ధ దేశంలో చిక్కుకుపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. తమ కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: 'ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు చవిచూశాం.. బాంబుల మోతతో కీవ్ దద్ధరిల్లింది'