శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా... ప్రాజెక్టుల్లోకి అధిక స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. సోమవారం రాత్రి 61 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో... అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రికి రాత్రే 17 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం ఉదయం జలాశయానికి ఇన్ఫ్లో 30,620 క్యూసెక్కులు ఉండగా... 10 గేట్లు ఎత్తి 31,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
విద్యుత్ ఉత్పత్తి కోసం 7,500 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం కూడా అంతే ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 90 టీఎంసీలు ఉండగా... ప్రస్తుత నీటినిల్వ 90 టీఎంసీలు ఉంది. ఇవాళ కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జలాశయానికి మరింత వరద వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: RAINS: రాష్ట్రంలో కుంభవృష్టి.. పలు జిల్లాల్లో జనజీవనం అతలాకుతలం