పల్లెలను కరోనా వణికిస్తోంది. కట్టడి చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. కాలనీల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్‌ఎఫ్‌సీ) గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయడం ఊరటనిచ్చింది. ఏప్రిల్, మే నెలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు రూ.20.60 కోట్లు కేటాయించారు.
నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ
పంచాయతీల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం ఎస్‌ఎఫ్‌సీ విడుదల చేసిన నిధులు నేరుగా పంచాయతీ ఖాతాలోనే జమకానున్నాయి. వీటిని పారిశుద్ధ్య నిర్వహణ, కార్మికులకు జీతభత్యాలకు వెచ్చిస్తారు.
వైరస్ నివారణకు చర్యలు
పల్లెల్లో రద్దీ ప్రాంతాలు, ప్రధాన వీధులు, వైరస్ సోకిన బాధితుల ఇంటి పరిసరాల్లో హైపోక్లోరైట్ పిచికారీ చేస్తున్నారు. ద్రావణంతోపాటు అవసరమైన సామగ్రి కొనుగోలుకు ఈ నిధులను వినియోగించుకోవచ్చు. కొవిడ్ బారిన పడి మృతిచెందితే వారి కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల పంచాయతీ పాలక వర్గాలే అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన నిధులు ఇందుకు వినియోగించుకోవడానికి వీలుంటుంది. వచ్చినవి సక్రమంగా వెచ్చించాలని జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ తెలిపారు.
ఇదీ చూడండి: అన్నం కోసం కష్టజీవుల బారులు.. దాతలందించే ఆహారమే ఆధారం