నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. చెరువులు, వాగులు జలకళను సంతరించుకోగా.. ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. నిజాంసాగర్ దిగువన మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కి ఎగువ నుంచి వరద క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం వరకు 80 వేల క్యూసెక్కులున్న ప్రవాహం మధ్యాహ్నానికి 1.38 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో ఈ ప్రాజెక్టుకు ఏడున్నర టీఎంసీల జలాలు వచ్చి చేరాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రానికి 6.60 టీఎంసీల జలాలు వచ్చాయి. ప్రాజెక్టులో నిల్వ 64.68 టీఎంసీలకు (పూర్తి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు) చేరుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆరు గేట్లు ఎత్తి 32,682 క్యూసెక్కులను పార్వతి బ్యారేజీ వైపు వదులుతున్నారు. ఇక్కడి నుంచి సరస్వతి బ్యారేజీకి అంతే వరదను విడుదల చేస్తున్నారు. ఈ బ్యారేజీలో ప్రస్తుతం 6.72 టీఎంసీల వద్ద నిల్వ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు జలాశయం సామర్థ్యం 31 అడుగులు కాగా పూర్తిగా నిండుకుని మత్తడి పారుతోంది. ప్రాణహిత, గోదావరి సంగమం వద్ద ఉన్న లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి 1.64 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 38 గేట్లు తెరిచి అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల కొనసాగుతోంది.
ఈనెల 8న 30 టీఎంసీలు ప్రాజెక్టులో నిల్వ ఉండగా.. ప్రస్తుతం 65 టీఎంసీలకు చేరింది. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 35 టీఎంసీల నీరు చేరింది. ఇదే ప్రవాహం ఉంటే ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కేవలం 2 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ మండలంలోని కల్యాణి ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో ఒక గేట్ ఎత్తి నీటిని మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుకు 14500 క్యూసెక్కులు
కృష్ణానదిలో ఎగువన ప్రవాహం పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి ఆలమట్టికి 45 వేల క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ వద్ద 50 వేల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 56 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 14500 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా శ్రీశైలానికి 22650 క్యూసెక్కులు వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు వద్ద 22 వేల క్యూసెక్కుల వరద నమోదవుతోంది. డ్యాం 8 గేట్లను ఎత్తి దిగువకు 38 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఆరు వేల క్యూసెక్కులు వస్తోంది.
ఇదీ చూడండి: Flow For Projects: వరద పారుతుంది.. ప్రాజెక్టు నిండుతుంది