నిజామాబాద్ జిల్లా సిరికొండలో అటవీశాఖ బీట్ అధికారిణి సునీతపై దాడికి యత్నించారని.. ఆరుగురు గిరిజనులకు న్యాయస్థానం 13రోజుల పాటు రిమాండ్ విధించింది. గ్రామానికి చెందిన ధారవత్ రాజు దాదాపు పదేళ్లుగా తండా పరిధిలోని పోడు భూమిలో మూడెకరాలలో సాగు చేస్తున్నారు. జాన్ 22న పొలం దున్నుతుండగా రావుట్ల బీట్ అధికారి సునీత అక్కడకు వచ్చి అటవీభూమిలో సాగు చేయడమేంటని ట్రాక్టర్‌ను సీజ్ చేసే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ స్వాధీనం చేసుకోడానికి ప్రయాత్నిస్తే తండా వాసులు అడ్డుకొని దుర్భాషలాడి, కారంపొడితో దాడికి యత్నించారని అటవీ అధికారులు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే సాగుచేసుకొంటున్నామని తండా వాసులు పేర్కొన్నారు.
అరెస్టులు అక్రమం...
జూన్ 29న అటవీశాఖ ఉన్నతాధికారులు ధారవత్ రాజును పిలిపించి జరిగిన ఘటనకు సంబంధించి అటవీ భూమి ఆక్రమణకు పాల్పడినందునా రూ.25వేలు అపరాధ రుసుం కట్టించుకున్నట్లు వివరించారు. ఇక గొడవ ముగిసిందని అనుకున్నారు. ఈ నెల 10న ఎస్సై ఠాణాకు పిలిపించి బీట్ అధికారిపై దాడికి యత్నించినందునా అరెస్టు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అపరాధ రుసుం కట్టించుకున్న తర్వాత మళ్లీ కేసు పెట్టడమేంటని తండా వాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 12న పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరుచారు. నిందితులను 13రోజుల పాటు రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
అటవీ భూమి అక్రమిస్తే ఉపేక్షించం
తండా వాసి రాజు అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతుండగా బీట్ అధికారి సునీత అడ్డుకుందని అటవీ అధికారులు వివరించారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే వరకు సాగు చేసుకొంటున్న భూముల జోలికి తాము వెళ్లబోమని స్పష్టం చేశారు. నూతన ఆక్రమణలను మాత్రం ఉపేక్షించబోమని ఎఫ్ఆర్ఓ వాసుదేవ్ స్పష్టం చేశారు.
ఇప్పటికీ అటవీభూములకు, రెవెన్యూ భూములకు స్పష్టత లేనికారణంగా అనేక గొడవలు జరుగుతున్నాయి. ఇరుశాఖల అధికారులు సరిహద్దు రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి సరిహద్దులు గుర్తిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు