School Children Need A Bag : మీ పిల్లలు స్కూల్‌కు వెళ్తూ తీసుకెళ్తున్న బ్యాగ్ బరువును మీరుప్పుడైనా గమనించారా? మీ పిల్లలు చదివే చదువుకు అంతా అవసరమా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? విద్యా బుద్ధులు నేర్చుకునేందుకు మానసికంగా ధృడంగా ఉండాల్సిన చోట.. శారీరకంగా అవస్థలు పడుతూ నిత్యం జబ్బుల బారిన పడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థుల అవస్థలైతే చెప్పడం కష్టమే. ఎందుకంటే పుస్తకాలు, క్లాస్ వర్క్, హోం వర్క్, నోట్‌బుక్స్, వర్క్ బుక్‌లు, స్పెషల్ క్లాస్ బుక్స్ వీటితో పాటు టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా.. అన్నింటిని నిత్యం వారు స్కూల్‌కు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే ఇక అంతే సంగతులు..
యశ్‌పాల్ కమిటీ సిపార్సులు : నిజంగా పిల్లలు ఈ విధంగా పుస్తకాల బరువు మోస్తూ రోజు పాఠశాలలకు వెళ్లాలని ఎక్కడైనా గైడ్ లైన్స్ ఉన్నాయా.. అంటే లేవనే చెప్పాలి. కేంద్రం యశ్‌పాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ పాలసీ-2020 పేరిట కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయినా, వాటిని పాటించే వారే లేరు. 1 నుంచి పదో తరగతి వరకు గల విద్యార్థుల స్కూల్ బ్యాగులు శరీర బరువులో 10% కంటే మించకూడదని సూచించింది. అలాగే పాఠశాలలో పిల్లల బ్యాగ్ బరువు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సిఫార్సు చేసింది. ప్రతి పాఠ్యపుస్తకం బరువు ప్రచురణ కర్తలు ఆ పుస్తకంపై ముద్రించాలని కూడా పాలసీలో సిఫార్సు చేసింది. ఎన్సీఆర్టీ సర్వేలు, అధ్యయనాలు కూడా ఇవే సిఫార్సులను చేశాయి.
నూతన మార్గదర్శకాలు :
- నూతన మార్గదర్శకాల ప్రకారం.. 1 నుంచి 2 తరగతుల విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువు 1.6 నుంచి 2.2 కిలోల బరువు మాత్రమే ఉండాలి. కానీ, ప్రస్తుతం 7.5కిలోల బరువును కేవలం యూకేజీ, ఫస్ట్ క్లాస్, రెండో తరగతి విద్యార్థులు మోస్తున్నారు.
- 3నుంచి 5 తరగతుల పిల్లలు 2 నుంచి 3 కిలోల వరకు స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలి. కానీ, 9.5కిలోల బరువు మోయాల్సి వస్తోంది.
- 6నుంచి 10 తరగతుల విద్యార్థులు 4 నుంచి 5 కిలోల ఉండాలి. వీరు 14.5కిలోల వరకు మోస్తున్నారు.
Situation Of School Bags In India : విదేశీ విద్యావిధానాలను అందిస్తున్నామని చెబుతున్న పాఠశాలలు కూడా అందుకు తగ్గ విధంగా అనుసరించడం లేదు. ముఖ్యంగా అమెరికా, ఫిన్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో పిల్లలు స్కూల్ బ్యాగ్ బరువులు చాలా తక్కువ. అక్కడ వారికి మానసికంగా పాఠాలు చెబుతారు తప్ప.. బండెండు పుస్తకాలతో పాఠాలు చెప్పడం లేదనేది వాస్తవం. మోసే వారికే దాని బరువు తెలుస్తోందన్న సామెత.. పిల్లల స్కూల్ బ్యాగ్ బరువుకు పక్కగా సరిపోతుందేమో. ఎందుకంటే ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యం.. ఇలా బరువులెత్తుతూ అనారోగ్యం పాలైపోవడం రానున్న రోజుల్లో చూస్తాం. ఇప్పుడు ఈ పుస్తకాలే వారి పాలిట శాపంగా మారాయనడంలో అతిశయోక్తి లేదు.
"పిల్లల పుస్తకాలను బ్యాగ్‌లలో స్కూల్లోనే ఉంచుతారు. అమెరికా, ఫిన్లాండ్ దేశాల్లో ఇలానే చేస్తారు. అంతే తప్ప పిల్లతో బ్యాగ్‌లను మోయించరు. ఆ పుస్తకాలను పట్టుకొని వెళ్లిన.. ఎక్స్ట్రా క్వశ్చన్ బ్యాంక్‌ను తీసుకెళుతున్నారు. అదీ కూడా ఒక లోడ్." - నర్రా రామారావు, విద్యావేత్త
నో బ్యాగ్ డే అమలులో ఉందా : ఇప్పటికే దేశంలో పిల్లల బ్యాగ్ బరువును తగ్గించడానికి చాలా రాష్ట్రాలు నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నాయి. ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంది. అంటే వారంలో గానీ, నెలలో గానీ ఏదో ఒకరోజు స్కూల్‌కు బ్యాగ్ పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది ఎంత వరకు అమల్లో ఉందో అందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే కేవలం కాగితాలకే పరిమితం. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు కూడా నిమ్మకు నీరేత్తినట్లు చూస్తూ ఊరుకుంటున్నారు.
డిజిటల్ వరల్డ్ వైపు అడుగులేస్తున్న మనం ఇంకా పిల్లలతో బండెడు పుస్తకాలు మోయించడం కరెక్టేనా? పిల్లలు ఆడుకునేందుకు సెల్ఫోన్లను అందించే మనమే.. వారి చదువు విషయంలో ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను ఈజీ లెర్నింగ్ వైపు అడుగులు వేసేలా వారిని ప్రోత్సహించాలి. ఇలానే కొనసాగితే దేశం 20 ఏళ్లు అయినా ఇదే తంతు కనిపిస్తోంది. సో తల్లిదండ్రులు అటు స్కూల్ సిబ్బంది.. పిల్లల స్కూల్ బ్యాగ్‌పై ఒకసారి దృష్టి సారించాలి. అప్పుడే వారి అమూల్యమైన భవిష్యత్‌కు మంచి పునాది వేసిన వాళ్లమవుతాం.
ఇవీ చదవండి :