కరోనా కారణంగా ఏర్పడిన నష్టాలను పూడ్చుకునే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. కొవిడ్‌తో ప్రయాణికులు తగ్గి కోల్పోయిన ఆదాయాన్ని కార్గో సేవల ద్వారా సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. వైరస్ కారణంగా ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే నెలకు రూ.అర కోటి వరకు సంస్థ ఆదాయానికి గండిపడగా.. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సరకు రవాణా, పార్శిల్, కొరియర్ సేవలు అందిస్తోంది. ఎరువులు, ధాన్యం, బియ్యం వంటివి రవాణా చేస్తూ ఆదాయం పొందుతోంది.
రోజుకు రూ. 20 నుంచి 30 వేల వరకు ఆదాయం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 711 ప్రజా రవాణా బస్సులు, 28 కార్గో బస్సులు అందుబాటులో ఉన్నాయి. కార్గో బస్సులను సరకు రవాణాకు వినియోగిస్తుండగా.. సాధారణ బస్సులను పార్శిల్, కొరియర్ సర్వీసుల కోసం వినియోగిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య సగానికి తగ్గింది. ఫలితంగా ఆ నష్టాలను పార్శిల్స్, కొరియర్ సర్వీసులతో పూడ్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ డిపోల్లో పార్శిల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో తగ్గిన ప్రయాణికుల స్థానంలో పార్శిల్, కొరియర్ సేవలతో భర్తీ చేస్తున్నారు. వీటి ద్వారా ప్రతి రోజూ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆర్టీసీకి ఆదాయం సమకూరుతోంది.
అద్దెకిచ్చేందుకు ప్రణాళికలు
మరోవైపు కార్గో బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిచ్చేందుకూ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అద్దెకు తీసుకునేవారు ప్రస్తుతానికి 240 కి.మీ.ల వరకు రూ.8,800, 5 శాతం జీఎస్టీ, టోల్, హమాలీ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పరిధి దాటితే కి.మీ.కు రూ.37 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి గరిష్ఠంగా 10 టన్నుల వరకు సరుకు తరలించే వీలుంది. అయితే 240 కి.మీ.ల పరిధిని 100 కి.మీ.లకు తగ్గించి అద్దెకు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తద్వారా మరిన్ని ఆర్డర్లు అందుకోవాలన్నది అధికారుల ఆలోచన.
కార్గో సేవలను మరింత విస్తరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాంతాల వారీగా ఏజెంట్లను నియమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రచారం లభిస్తే మున్ముందు ఆదాయం భారీగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇదీచూడండి: 21న ఐటీ టవర్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్