దేశం కాని దేశంలో.. తాను చేయని నేరానికి జైలుపాలైన ఆ యువకుడు.. 14 ఏళ్ల పాటు కటకటాల్లో మగ్గిపోయాడు. కోర్టు మరణశిక్ష విధిస్తే.. తానిక స్వస్థలానికి రాలేనని కుమిలిపోయాడు. ఎట్టకేలకు శిక్ష నుంచి బయటపడిన ఆయన పేరు మాకురి శంకర్. నిజామాబాద్ జిల్లా మెండోర మండలానికి చెందిన ఈయన 17 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి చేరుకున్నారు. ఉపాధి కోసం 2006లో దుబాయ్‌కి వెళ్లిన శంకర్ ఓ కంపెనీలో ఫోర్‌మన్‌గా పని చేశారు. దుబాయ్ వెళ్లే సమయంలో ఆయన భార్య గర్భిణి. కొద్ది రోజుల తర్వాత కుమారుడు జన్మించాడు.
శంకర్ 2009లో తిరిగి రావాల్సి ఉండగా.. ఆయన పని చేస్తున్న కంపెనీలో ఓ వ్యక్తి ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి మరణించారు. ఇందుకు శంకర్‌ను బాధ్యుడిని చేసి అక్కడి అధికారులు జైలులో పెట్టారు. 2013లో అక్కడి కోర్టు శంకర్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై ఆయన పునఃపరిశీలన కోసం కోర్టుకు అప్పీలు చేసుకోగా.. విచారణ సాగింది. మరణశిక్ష నుంచి బయటపడాలంటే మృతుని కుటుంబం నుంచి క్షమాభిక్ష పత్రం తీసుకురావాలని న్యాయస్థానం నిర్దేశించింది. దీంతో శంకర్ కుటుంబీకులు నిజామాబాద్ జిల్లాకు చెందిన తెదేపా నాయకుడు దేగాం యాదాగౌడ్, దుబాయ్‌లోని న్యాయవాది అనూరాధలను ఆశ్రయించారు. మరణించిన వ్యక్తిది రాజస్థాన్ అని తెలియడంతో అక్కడికి వెళ్లి వారి కుటుంబసభ్యులను కలిశారు. రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మొత్తాన్ని విరాళాల రూపంలో పోగు చేసి అందించారు. క్షమాభిక్ష పత్రాలను కోర్టుకు సమర్పించడంతో శంకర్ మరణశిక్ష నుంచి విముక్తి పొందారు. వారం రోజుల కిందట జైలు నుంచి విడుదలై.. శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు.
ఇవీ చూడండి..
villagers reunion: ఆ ఊరు మళ్లీ అందరిని కలిపింది..
సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన ఫార్ములా ఈ-రేస్.. విజేతలుగా నిలిచింది వీరే