రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో విద్యాసంస్థలను మూసివేయడం సరైంది కాదని విద్యార్థి నాయకులు అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి సెంట్రల్ లైట్ వరకు పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యాసంస్థల బంద్ నుంచి విశ్వవిద్యాలయాలను మినహాయించాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ తరగతులను గ్రామీణ విద్యార్థులు వినలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలు, పార్కులు, సినిమ థియేటర్లను కొనసాగిస్తూ విద్యాసంస్థలను మాత్రమే మూసివేయడం సరైన నిర్ణయం కాదని విజ్ఞప్తి చేశారు.
యూనివర్సిటీలలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. హాస్టళ్లతో పాటు పీజీ, డిగ్రీ విద్యార్థుల పరీక్షలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోశ్, నవీన్, సంపత్, ప్రవీణ్, సుజిత్, సంజీవ, ప్రశాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఆలయానికి దారి అడిగాడు.. బంగారం లాక్కెళ్లాడు'