తెల్లారేసరికి ఎంత మంది బతుకులు తెల్లారిపోతున్నాయో తెలియడం లేదు. క్షణ క్షణానికి ఎంత మందిని కబళిస్తోందో లెక్కపెట్టలేకపోతున్నాం. కోరలు చాస్తున్న కరోనా మృత్యవాహనమెక్కి విలయ తాండవం చేస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తీసుకుపోతుంది. కొవిడ్ గురించి ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారడం లేదు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీ పేటలో బీరప్ప పండుగ సందర్భంగా కొవిడ్ నిబంధనలు గాలికొదిలేశారు. కుర్మ సామాజిక వర్గం ఐదేళ్లకోసారి జరుపుకునే బీరప్ప పండుగను గతేడాది లాక్డౌన్ కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది అదే పరిస్థితి తలెత్తడం వల్ల... భక్తుల విజ్ఞప్తిపై అధికారులు అనుమతిచ్చారు. సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో వేడుక చేసుకోవాలని సూచించారు.
శని, ఆదివారాల్లో పోలీసులు అధికారులు భక్తులను సమన్వయపరిచి భౌతిక దూరం పాటించేలా జాగ్రత్త తీసుకున్నారు. అంతవరకూ భాగానే ఉన్నా సోమవారం ముగింపు వేడుకల్లో నిబంధనలు తుంగలో తొక్కారు. వందల సంఖ్యలో జనం గుమిగూడి వేడుక చేసుకున్నారు. చివరి రోజు ఒక్కసారిగా భక్తులంతా పోటెత్తడం వల్ల పరిస్థితి చేయి దాటిందని సీఐ శ్రీశైలం వెల్లడించారు.
పండుగలు ఈసారి కాకపోతే మరో సారి చేసుకోవచ్చు.. బయట పరిస్థితి ఎలా ఉందో తెలుసు.. గ్రామంలో కేసులు ఉన్నాయని తెలుసు.. నిబంధనలు అతిక్రమిస్తున్నామని తెలుసు.. అన్నీ తెలిసి బాధ్యతలు విస్మరిస్తే... ఎవరని ఏం చేయగలరు. ఇలాంటి ఘటనలే కొవిడ్‌కు సింహద్వారాలు.
ఇదీ చూడండి: ఉదాసీనత అసలే వద్దు.. వారంలోనే పరిస్థితి తీవ్రం కావచ్చు!