సామాన్యుడి రవాణా సాధనం ఆర్టీసీ బస్సు లాక్‌డౌన్‌లో ఉంది. బస్సులు రోడ్లెక్కేది ఎప్పుడని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో... సీఎం కేసీఆర్ ఈ నెల 15న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సులు నడపాలా వద్దా అనే విషయంపై చర్చిస్తామని చెప్పారు. దీంతో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న ఆరు డిపోల్లో రూ.44 కోట్ల నష్టం తేలింది. మొత్తం 670 బస్సులు, 2800 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కండక్టర్లు 1220, డ్రైవర్లు 1030 మంది ఉన్నారు. మిగిలినవారు ఇతర విభాగాల సిబ్బంది ఉన్నారు.
రోజూ పరిశీలించాల్సిందే...
బస్సులు ఎక్కువ రోజులు నడపకుంటే పాడవుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైన రోజు నుంచి ప్రతి డిపోలో రోజుకు ఐదు మంది మెకానిక్‌లు పని చేస్తున్నారని తెలిపారు. బస్సులను కొద్ది సమయం స్టార్ట్ చేసి ఉంచడం, మరమ్మతులు చేస్తున్నారు. డిపోలో ఉన్న ప్రతి బస్సును రోజూ కొద్దిసేపు నడపకపోతే అన్ని టైర్లు మూలన వేయాల్సిన ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తనిఖీ చేయాల్సిందే...
బస్సులు నడిపిన సమయంలో ఎలా తనిఖీ చేయాలో డిపోలో నిలిపి ఉన్నప్పుడు కూడా అలానే చేయాలి. ప్రతి డిపోలో షిప్టుల వారీగా 33 శాతం ఎక్ట్రీషియన్లు, మెకానిక్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే బస్సులను నడిపేలా సిద్ధంగా ఉంచాం.
- సోలోమాన్, ఆర్టీసీ ఆర్‌ఎం