దేశంలోనే విత్తనపత్తి అత్యధికంగా సాగయ్యే జిల్లా జోగులాంబ గద్వాల. దేశంలో ఉత్పత్తి అయ్యే విత్తనపత్తిలో జిల్లా వాటా సుమారు 30శాతం. 40వేల మంది రైతులు, కూలీలు, ఆర్గనైజర్లు, కంపెనీల్లో సిబ్బంది సహా లక్షల మంది విత్తనపత్తిపై ఆధారపడి జీవిస్తూంటారు. దశాబ్దాలుగా నడిగడ్డ రైతులు విత్తనపత్తిపై ఆధారపడే జీవనం సాగిస్తున్నా... వారి జీవితాలు మాత్రం మారడం లేదు. ఆదాయం లేకపోగా...అక్కడ పాతుకుపోయిన ఆర్గనైజర్ల వ్యవస్థ, కంపెనీల దోపిడి వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
వాళ్లే ఇస్తారు... తిరిగి దోచుకుంటారు...
విత్తనపత్తి సాగు చేసే రైతుకు విత్తన కంపెనీలే 12శాతం వడ్డీతో అప్పుగా ఇస్తాయి. కానీ కంపెనీకి, రైతులకు మధ్యవర్తులుగా వ్యవహరించే ఆర్గనైజర్లు 2రూపాయల వడ్డీ రైతుల నుంచి వసూలు చేసి పెట్టుబడి ఇస్తారు. దీనికి ఎలాంటి చట్టబద్ధమైన ఒప్పంద పత్రాలు ఉండవు. జూన్, జూలైలో విత్తనపత్తి సాగు మొదలవుతుంది. ఒకటి, రెండు నెలల ముందే ఆర్గనైజర్లు రైతులకు పెట్టుబడి పేరు మీద అప్పులిస్తారు. అప్పటి నుంచే వడ్డీ లెక్క గడతారు. జూన్, జూలైలో సాగు చేసిన పంట నవంబర్, డిసెంబర్ మాసంలో చేతికొస్తుంది. చేతికొచ్చిన పంటను రైతులు ఆర్గనైజర్లకు అప్పగిస్తారు. పంట ఎప్పుడు అప్పగిస్తే అప్పటి వరకే వడ్డీ వసూలు చేయాలి. పెట్టుబడి ఇచ్చిన కంపెనీ ఆర్గనైజర్ల నుంచి అప్పటి వరకే వడ్డీ వసూలు చేస్తుంది. ఆర్గనైజర్లు మాత్రం మళ్లీ సీజన్ ప్రారంభమయ్యే వరకూ లెక్కలు తేల్చరు. వడ్డీ మాత్రం వసూలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల వచ్చే ఆదాయం వడ్డీలకే సరిపోతుందని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
తూకంలోనూ దోపిడి..
పంట అప్పగించిన తర్వాత కూడా... రైతులపై దోపిడి కొనసాగుతుంది. మిల్లుల్లో విత్తనాన్ని, పత్తిని వేరుచేసే జిన్నింగ్ ఛార్జీల భారం సైతం రైతు మీదే పడుతుంది. విత్తనాల తూకంలోనూ క్వింటాకు 7 కేజీల చొప్పున తరుగు తీస్తారు. గింజ లేని పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో ఏ రేటు ఉందో అదే రేటు రైతుకు చెల్లించాలి. ఆ ధరల్ని కాటన్ మిల్లుల వద్ద ప్రదర్శించాలి. కానీ ఆ సీజన్ లో కనిష్ఠంగా ఏ రేటు ఉంటుందో అదే రేటు చెల్లిస్తారు. రవాణా, బీమా, ఇతర ఖర్చులంటూ ఇచ్చే డబ్బులోనూ కోతలు పెడతారు. అసలు తాము పండించిన పంటకు దేనికి ఎంత రేటు వచ్చిందో, దేనికి ఎంత ఆదాయం వచ్చిందో.. అప్పులు పోను ఎంత మిగిలిందో రైతులకు తెలిసేది జూలైలోనే.
ప్యాకెట్లలోనూ కోతలు...
వేరుచేసిన విత్తనాన్ని శుద్ధిచేసిన అనంతరం నాణ్యమైన విత్తనాలు తూకం వేసటప్పుడు మాత్రం కంపెనీలు రైతులను తప్పనిసరిగా పిలుస్తాయి. వాళ్ల ముందే తూకం వేసి.. రశీదు ఇచ్చి పంపుతాయి. మళ్లీ అక్కడ దోపిడీ కొనసాగుతుంది. శుద్ధిచేసిన విత్తనాల్లో పనికిరాకుండా పోయిన విత్తనాలు, నాసిరకం విత్తనాలంటూ మొత్తం ప్యాకెట్ల నుంచి 10 నుంచి 20శాతం ప్యాకెట్లను కోత కోస్తారు. అలా తరుగుపోగా వచ్చిన విత్తన ప్యాకెట్లకే డబ్బులు లెక్కగట్టి ఇస్తారు. వాస్తవానికి ఒక్కో ప్యాకెట్ కు 450 నుంచి 490 రూపాయలు విత్తన కంపెనీలు ఆర్గనైజర్లకు చెల్లిస్తాయి. ఆర్గనైజర్లు మాత్రం.. రైతులకు ప్రస్తుతం గరిష్టంగా 410 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. గతేడాది ఈ ధరను పెంచాలని రైతులు డిమాండ్ చేసినా ఆర్గనైజర్లు అందుకు ససేమిరా అన్నారు. ఈ ఏడాది విత్తన కంపెనీలు ప్యాకెట్ ధరను 20 రూపాయలు తగ్గించాయి. ఆర్గనైజర్లు సైతం రైతులకు చెల్లించే ప్యాకెట్ ధరను 10 నుంచి 20 రూపాయలు తగ్గించాలనే యోచనలో ఉన్నారు.
అప్పు తీరదు... వేరే పంట వేయరు...
ఏటా ఎరువులు, పురుగుల మందులు, కూలీల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ ఏడాది లాక్ డౌన్ నేపథ్యంలో కూలీల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. చేసే సాగు వ్యయం కూడా ఈసారి సుమారు 20శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెరుగుతున్నా... ప్యాకెట్ పై రైతుకు చెల్లించే ధరను పెంచకపోగా.. ఈసారి తగ్గిస్తామని చెప్పడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. విత్తనపత్తి కాకుండా మరో పంటను సాగు చేద్దామని భావించినా.. చేసిన అప్పు వెంటనే తిరిగి చెల్లించాలి. లేదంటే ఆర్గనైజర్ చెప్పినట్లుగా విత్తనపత్తిని సాగు చేయాలి. అందుకే ఒక్కసారి విత్తనపత్తి సాగులోకి ప్రవేశిస్తే ఆ ఉచ్చు నుంచి బైట పడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
దళారీ వ్యవస్థను రూపుమాపేలా చర్యలు...
ఈ దోపిడీకి అడ్డుకట్ట పడాలంటే... రైతుకు, కంపెనీకి మధ్య లేదా రైతుకు, అర్గనైజర్ కు, కంపెనీకి మధ్య సాగుకు ముందే ఒప్పంద పత్రం ఉండాలి. అందులో పెట్టుబడి రుణం, దానిపై వసూలు చేసే వడ్డీ, విత్తన ప్యాకెట్ రేటు సహా అన్ని అంశాలు పొందుపరచాలి. గత ఏడాది విత్తనపంట సాగు వివరాలు అందించాలని కోరితే.. కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే వివరాలు ఇచ్చాయంటే... కంపెనీలు, ఆర్గనైజర్ల వ్యవస్థ... తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్గనైజర్లు మాత్రం తాము రైతులకు ఎక్కడా అన్యాయం చేయలేదని...చేయబోమని... త్రైపాక్షిక ఒప్పందానికీ తాము సిద్ధమని చెబుతున్నారు. ఇటీవల వ్యవసాయశాఖ త్రైపాక్షిక ఒప్పందం ముసాయిదాను సైతం రూపొందించింది. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర సర్కారు విత్తనపత్తి రైతుల సమస్యపైన దృష్టి సారించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.